Police Custody For Gudem Madhusudhan Reddy : అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామ పరిధిలో మధుసూదన్ రెడ్డి సంతోశ్ శాండ్ అండ్ గ్రానైట్ క్వారీని నడుపుతున్నారు. పరిమితికి మించడంతో పాటు గడువు ముగిసినా క్వారీ నిర్వహణ జరుగుతున్నందున ఈ నెల 15న పటాన్‌చెరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా, న్యాయస్థానం 3 రోజులకు అనుమతించింది. దీంతో నేడు మధుసూదన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఎమ్మార్వో ఫిర్యాదుతో అరెస్ట్ : లక్డారం గ్రామంలో మధుసూదన్ రెడ్డి సంతోశ్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి, పరిమితికి మించి తవ్వకాలు జరిపారని, దాంతోపాటు అనుమతుల గడువు పూర్తయినా మైనింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఇటీవల ఆ క్వారీని సీజ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 15న మధుసూదన్ రెడ్డిపై అక్రమ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తెల్లవారుజామున ఆయనను అరెస్టు చేశారు.
అక్రమ మైనింగ్ కేసు - పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు అరెస్ట్