Police inspects at Moneylenders Homes : ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు వ్యక్తులు, అమాయకులకు అప్పులను ఇస్తూ అధిక వడ్డీలతో వసూలు చేస్తున్నారు. బాధితుల నుంచి ముందుగానే పూచీకత్తుగా భూముల పత్రాలు, ఇంటి పత్రాలు, ఇంటి స్థలాల పేపర్లు మొదలగు వాటిని తీసుకుని, బాకీలు ఇస్తున్నారు. సదరు వ్యక్తులు డబ్బులు కట్టలేని పక్షంలో, వ్యాపారస్థులు పూచీకత్తుగా తీసుకున్న పత్రాలతో కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు పోలీసుల దృష్టికి రావడంతో, వీటిని అరికట్టడానికి రంగంలోకి దిగారు.
అధిక వడ్డీలకు వ్యాపారం చేస్తున్న పలువురి ఇళ్లపై జగిత్యాల(Jagtial), సిద్దిపేట జిల్లాలో పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. ఉదయం నుంచి ఈ దాడులు ప్రారంభించారు. పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్న పోలీసులు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా కూడా పోలీసులు వడ్డీ వ్యాపారస్థుల ఇళ్లు, దుకాణాలలో సోదాలు నిర్వహించారు. కోహెడ మండల కేంద్రంలోని పలువురు వడ్డీ వ్యాపారులు, చిట్టీలు నడిపే నిర్వాహకుల ఇండ్లలో పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. సోదాలలో కొంత నగదు, లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.