Police Checking over Election Code in Maharashtra :ఎన్నికలు అనగానే హడావిడి మొదలవుతుంది. నాయకులు, కార్యకర్తలు ఆ జోష్‌లో మునిగి తేలుతారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం ప్రవాహం ఏరులై పారుతుంది. డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటారు. మహారాష్ట్రలో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రచారం ఊపందుకుంది. అధికార యంత్రాంగం సైతం నియామవళి అమలుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పెట్టి ముమ్మర తనిఖీలు చేస్తుంది. అయితే ఇందులో చాలా వరకు అమాయకులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహారాష్ట్రతో పాటు తెలంగాణ సరిహద్దులోనూ మన అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల కిన్వట్ నుంచి తెలంగాణ వైపు వస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆ వాహనాన్ని పరిశీలించగా రూ.12 లక్షల నగదుతో పట్టుబడింది. తర్వాత ఆధారాలతో ఆ వ్యక్తి నగదు తిరిగి పొందాడు. మహారాష్ట్రకు చెందిన మేకల వ్యాపారులు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మేకల సంతకు వస్తుండగా, మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా మార్గంలో తనిఖీల్లో పలువురి దగ్గర రూ.13 లక్షలు పట్టుబడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య మేకల, పశువుల సంతకు చాలా మంది వెళ్తారు. దీంతో ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉంది. ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లోని తానూరు, ముథోల్, బాసర, కుభీరు, కుంటాల, సారంగాపూర్ మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం పంట ఉత్పత్తుల కాలం కొనసాగుతోంది. ఆ మండలాల్లోని రైతులు పంట ఉత్పత్తులను మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, భోకర్, ఇస్లాపూర్, హిమయాత్‌నగర్, కిన్వట్ మార్కెట్లలో విక్రయించి నగదుతో పయనమవుతుంటారు.