AP YSRCP Former MP Nandigam Suresh Arrested : ఏపీ వైఎస్సార్సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయణ్ని అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని వారి ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు.
అయితే అరెస్ట్ భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది.