తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సులో బంగారంతో ప్రయాణిస్తున్నారా? - థార్ గ్యాంగ్ వచ్చేస్తోంది - బీ కేర్​ఫుల్ - THAR GANG ROBBERIES IN BUSES IN HYD

Police Arrested Thar Gang in Hyderabad : విలువైన ఆభరణాలతో బస్సుల్లో ప్రయాణిస్తున్నారా అయితే అప్రమత్తంగా ఉండండి. బస్సుల్లో తరలించే బంగారాన్నే లక్ష్యంగా చేసుకొని థార్‌ ముఠా ఘరానా చోరీలకు పాల్పడుతోంది. ఆ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు రాచకొండ పోలీసులు కళ్లెంవేశారు. ముఠాలోని కీలక సభ్యుడిని అరెస్టు చేసి. చోరీ చేసిన కోటీ 26 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెక్కీ నిర్వహించిన నిందితులు కేవలం 3 నిమిషాల్లోనే కోటి రూపాయలకు పైగా విలువైన ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Police arrested Gold Robbery Gang
Police Arrested Thar Gang (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 11:34 AM IST

Updated : Aug 10, 2024, 2:21 PM IST

Police arrested Gold Robbery Gang :దేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకొని కోట్ల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న థార్‌ముఠా ఆగడాలకు రాచకొండ పోలీసులు అడ్డుకట్ట వేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సోనీఠాకూర్‌ను చౌటుప్పల్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి కోటి 26 లక్షల రూపాయల విలువైన కిలో 832 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌ థార్‌ జిల్లాకు చెందిన థార్‌ ముఠా నాయకుడు అలీఖాన్, అస్లాం, సోనీఠాకూర్‌ ముందుగా బంగారు దుకాణాలపై నిఘా ఉంచుతారు.

అక్కడి నుంచి పెద్దఎత్తున బంగారు ఆభరణాలు ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నట్టు తెలియగానే రంగంలోకి దిగుతారు. ఆభరణాలు తీసుకెళ్లే వ్యక్తిని వెంబడిస్తారు. అతడు ప్రయాణించే బస్సు నంబర్‌, ఏ సీటులో కూర్చుంటారనే వివరాలు సేకరిస్తారు. బస్సు బయల్దేరగానే ముఠా సభ్యులు వెనుక నుంచి కారులో వెంబడిస్తారు. మార్గమధ్యలో ప్రయాణికులు అల్పాహారం తీసుకునేందుకు బస్సు ఆపినప్పుడు గుట్టుచప్పడు కాకుండా లోపలకు దూరి బంగారం ఉంచిన సంచిని తీసుకొని మాయమవుతారు. ఇదీ థార్‌ గ్యాంగ్ చోరీలకు పాల్పడే విధానం.

అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు కళ్లెం : అదే తరహాలో జులై 26న ముంబయిలోని ఏడీ జువెలరీస్‌ మాల్‌లో పనిచేసే ఉద్యోగి భరత్‌కుమార్‌ 2.1 కిలో గ్రాముల బంగారు ఆభరణాలని ఏపీలోని విజయవాడలోని ఏడీ జువెలరీ దుకాణంలో ఇచ్చేందుకు ముంబయి నుంచి ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సులో బయల్దేరారు. జులై 27న ఉదయం ప్రయాణికులు అల్పాహారం కోసం చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం వద్ద బస్సు ఆపారు. ఆ సమయంలో థార్‌ ముఠా వెంబడించి బంగారాన్ని చోరీ చేసింది.

బాధితుడి ఫిర్యాదుతో చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ప్రత్యేక బృందాలతో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో గాలించారు. ఈ క్రమంలో ముఠాలోని సోనీఠాకూర్‌ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సుల్లోనే ఆ ముఠా ఎక్కువగా చోరీలకి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఆ బస్సులే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చెయ్యడం? ఈ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల వివరాలు సీట్ల నంబర్లతో సహా నిందితులకు తెలియడం, వెనుక ఆంతర్యం ఏంటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అలీఖాన్, అస్లాంలు దొరికితే మరిన్ని కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

'ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సుల్లోనే ఆ ముఠా ఎక్కువగా చోరీలకు పాల్పడ్డారు. ఎక్కడి నుంచి బంగారం తరలిస్తున్నారు. బంగారం తీసుకెళ్లే వ్యక్తి ఏ సీట్లో కూర్చుంటారు అనే సమాచారం నిందితులకు ముందే తెలుస్తోంది. పక్కా సమాచారంతో బస్సులో చోరీలకు పాల్పడుతున్నారు' - రాచకొండ పోలీస్‌ కమిషనర్‌

ట్రావెల్స్ బస్సులో 3 కిలోల బంగారం చోరీ చేసింది మధ్యప్రదేశ్ గ్యాంగ్ - Three Kg Gold Robbery Case

అయ్యో పాపం!! - టిఫిన్​ చేద్దామని బస్సు దిగితే - 4 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు - 4KGS GOLD THEFT IN SANGAREDDY

Last Updated : Aug 10, 2024, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details