తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రిని కోల్పోయిన కొన్ని నెలలకే ఆ చిన్నారులపై విష ప్రయోగం - POISONING OF CHILDREN

శీతల పానీయంలో కలిపిన గడ్డి మందు తాగిన పిల్లలు - ఘటన వెనకాల తల్లి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు - మనోవేదనతో ఆందోళనకు గురై ఎలుకల మందు తాగిన తల్లి

Poisoning of children
Poisoning of children (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2025, 3:37 PM IST

Poisoning of Children in Mahabubabad : ఆ చిన్నారులిద్దరూ మూడు నెలల క్రితం తమకెంతో ఇష్టమైన తండ్రిని కోల్పోయారు. అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటున్నారు. ఈనెల ఫిబ్రవరి 5న పిల్లలిద్దరూ వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకోవటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ టెస్టుచేయగా చిన్నారులపై విష ప్రయోగం జరిగిందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మూడు రోజుల అనంతరం మెరుగైన వైద్యం అందించడం కోసం పిల్లలను హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆలస్యంగా వెలుగులోకి ఘటన : వారి వెంట వెళ్లిన తల్లి అక్కడ ఎలుకల మందు తాగి ఆత్మాహత్యకు ప్రయత్నించటంతో ఆమెను హైదరాబాద్​​లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి కోలుకోగా చిన్నారులిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్‌ డోర్నకల్‌ మండలం జోగ్యతండాలో చోటు చేసుకున్న ఈ ఘటన చిన్నారుల నాయనమ్మ బుజ్జి ఫిర్యాదుతో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. జోగ్యాతండాకు చెందిన ఆటో డ్రైవర్‌ వాంకుడోతు వెంకటేశ్‌కు తొమ్మిదేళ్ల క్రితం కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన ఉష అనే యువతితో వివాహమైంది.

ఎలుకల మందు తాగిన తల్లి : 2024 అక్టోబరు 11న వెంకటేశ్‌ అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. అప్పటి నుంచి పిల్లల బాగుగోలు తల్లి ఉష చూసుకుంటున్నారు. వారం కిందట కూల్​ డ్రింక్స్​లో కలిపిన గడ్డి మందు తాగిన పిల్లలు వరుణ్‌తేజ్‌(07), నిత్యశ్రీ(05) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని మొదట ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాద్​లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన వెనకాల తల్లి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడి చికిత్స అనంతరం కోలుకున్నారు.

అనుమానాలు ఉన్నాయి! : మనమడు, మనమరాలిపై విష ప్రయోగం జరిగిందని తెలియడంతో, మూడు నెలల క్రితం తమ కుమారుడు వెంకటేశ్‌ అనారోగ్యంతో చనిపోవటంపై అనుమానాలున్నట్లు అతడి తల్లిదండ్రులు శ్రీను, బుజ్జి కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలపై విష ప్రయోగం గురించి డోర్నకల్‌ సీఐ రాజేష్‌ను సంప్రదించగా వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసు సిబ్బందిని హైదరాబాద్‌ పంపినట్లు తెలిపారు. వారిచ్చే నివేదికను అనుసరించి తండాలోనూ పూర్తి విచారణ జరుపి వివరాలు వెల్లడిస్తామన్నారు.

బాలికల చదువులపై కుట్ర.. బడి మాన్పించేందుకు విషప్రయోగాలు.. వెయ్యి మందికి పైగా

కలెక్టర్​పై విషప్రయోగం!- సీబీ సీఐడీ దర్యాప్తు

ABOUT THE AUTHOR

...view details