PM Modi Stay in Rajbhavan :లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) ముంగిట ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. నేడు ఆదిలాబాద్‌లో పర్యటించిన ప్రధాని, మంగళవారం రోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి పర్యటన నిమిత్తం, మోదీ ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీజీపీ, సీఎస్ సాదర స్వాగతం పలికారు.
PM Modi Telangana Tour : ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండో రోజు పర్యాటనలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9వేల 21కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అధికారిక సమాచారం మేరకు ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరి 10.45 గంటలకు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభాప్రాంగాణానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి జిల్లాలో రూ. 1,409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా జాతీయ రహదారిని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అదే విధంగా సంగారెడ్డి క్రాస్‌రోడ్డు నుంచి మదీనాగుడా వరకు1298 కోట్ల రూపాయలతో ఎన్‌హెచ్-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న ఎన్‌హెచ్-765D మెదక్-ఎల్లారెడ్డి జాతీయ రహదారి విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి-రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 12.30 గంటలకు సంగారెడ్డి నుంచి బయలుదేరి వెళ్తారు.