Notices to Four BRS ex MLAs : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయమున్న రాజకీయ నాయకుల డొంక కదులుతోంది. ఇప్పటికే నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ కాగా, తాజాగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలనూ విచారణకు పిలిచినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతలు.
మునుగోడు బైపోల్ సమయంలో ఏం జరిగింది : మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వీరు అప్పట్లో నడుచుకున్న తీరుపై విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. అప్పటి లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే నోటీసుల విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వీరిని ప్రశ్నించిన తర్వాత మరికొందరు కీలకమైన లీడర్లకూ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
రేపు విచారణకు రానున్న చిరుమర్తి : ఇదే కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న అడిషనల్ ఎస్పీ(సస్పెండెడ్) తిరుపతన్నతో జరిపిన ఫోన్ సంభాషణల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్యను ఈనెల 11న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన వస్తానని ఆయన సమాధానమిచ్చారు. తిరుపతన్న క్రితంసారి శాసనసభ ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి అభ్యర్థుల, ప్రతిపక్ష నేతల కదలికలపై తన బృందంతో సాంకేతిక నిఘా ఉంచారు. ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించేందుకు ఈ బృందం పనిచేసిందని దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు.