Phone Tapping Case News Latest : ఫోన్‌ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలో 4 వేల 5 వందలకుపైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో నాలుగో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై జరిగిన వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నవంబరు 15 నుంచి 30వ తేదీల మధ్యనే అన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి సహా ఇతర నేతలు, వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సుమారు 340జీబీ సమాచారాన్ని పోలీసులు వెలికితీసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అభియోగపత్రం నమోదు చేశారు.
మరికొన్ని రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు నివేదిక పంపించారు. ఈ క్రమంలో రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయి నిందితులిద్దరినీ భారత్‌కు డిపోర్ట్ (బలవంతంగా స్వదేశానికి తిప్పిపంపడం) చేస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విధంగా నిందితులు దొరికితే వారిని సైతం విచారించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న సమాచారం తెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సమాచారం సేకరించిన వెంటనే దర్యాప్తు వివరాలతో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నారు.