Telangana Phone Tapping Case Updates :స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. గత శానసనభ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే డీఎస్పీ ప్రణీత్‌రావు ఎస్‌ఐబీ కార్యాలయంలోని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి మూసీలో పడేయటం, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అభియోగాలపై కేసులు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు.
Phone Tapping Case Investigation After Lok Sabha Polls : ప్రణీత్‌రావు ప్రతిపక్షపార్టీలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిన బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇవే అభియోగాలపై ఇప్పటి వరకూ నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎస్‌ఐబీకి నేత్వత్వం వహించిన ప్రభాకర్‌రావు ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన అమెరికా వెళ్లిపోయారు.
కేసులో ప్రభాకర్‌రావు పేరు : ప్రభాకర్‌రావు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కానీ ఇప్పటి వరకూ ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు ఇంకా చేర్చలేదు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభాకర్‌రావు పేరును కూడా కేసులో చేర్చి అవసరమైతే అరెస్ట్ చేయాలన్నది పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది.
Task Force EX OSD Radhakishan Rao Case :ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ మొదటి దశ దర్యాప్తు పూర్తయ్యేసరికి, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో పోలీసులు కూడా ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. మరోవైపు ఇక మీదట జరిగే దర్యాప్తు అంతా రాజకీయ నాయకులు చుట్టూనే తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో నేతలను విచారణకు పిలిపిస్తే రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఉందని, తద్వారా పరిణామాలు ఎటునుంచి ఎటు దారి తీస్తాయో కూడా తెలియదని ఓ అధికారి అన్నారు.
ఎన్నికల తర్వాత దర్యాప్తు ప్రారంభం : దీనికితోడూ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోనూ ఫోన్ ట్యాపింగ్‌పై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ఈ దర్యాప్తునకు కొంత విరామం ఇచ్చి, ఎన్నికలు పూర్తైన తర్వాత తిరిగి మొదలు పెట్టాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఈలోపు ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తును పునఃసమీక్షించుకోవడం, నిందితులు దాఖలు చేసుకుంటున్న బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించడానికి అవసరమైన సమాచారం సిద్ధం చేసుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.