Fine for Pet Dogs Owners for Dog Defecating : కుక్క పిల్లలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది అయితే ఏకంగా కుక్కలను కూడా తమ కుటుంబ సభ్యులలాగా భావిస్తారు. వాటిని పెంచుకోవడానికి దాదాపు చాలా మంది ఆసక్తి చూపుతారు. వాటి ఆలనాపాలనా సైతం తామే చూసుకుని సరదాగా కాసేపు దాన్ని షికారుకు తీసుకెళ్తారు. కొందరైతే కుక్కను వెంటపెట్టుకుని ప్రతి రోజూ వాకింగ్ సైతం చేస్తారు. చిన్నపిల్లలకు ఇష్టమని లేక ఇంటికి కాపలాగా ఉంటుందని ఏదో ఓ కారణంతో పెంపుడు శునకాలను పెంచుకుంటారు. ఇదంతా ఇప్పటి వరకు ఓకే. కానీ ఇప్పుడు కుక్కలపై కూడా కొన్ని నిబంధనలు వచ్చాయి. కుక్కేగా అని ఇంటిబయటకు తీసుకెళ్లి వదిలేస్తే, అక్కడ అది బహిరంగా మల విసర్జన చేస్తే మీ జేబుకు చిల్లులు పడ్డట్లే! మున్సిపల్ సిబ్బంది విధించిన ఫైన్ కట్టి తీరాల్సిందే.
రాష్టంలో మున్సిపల్ చట్టంలో ఉన్న ఈ నిబంధనను ఇప్పటి నుంచి అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లో కఠినంగా అమలు చేయనున్నారు. ఈ నిబంధనను పాటించాలంటూ జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు సైతం సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఇదే నిబంధన జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలులో ఉంది. పట్టణాల్లో పరిసరాల అపరిశుభ్రతకు శునకాల మల విసర్జన కూడా ఓ కారణం.