Heavy Traffic Jam at Chilkur Balaji Temple :రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాద వితరణ భక్తులు, సామాన్యులను తీవ్ర ఇబ్బందులను గురిచేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ అనంతరం సంతాన లేమితో బాధపడే మహిళలకు గరుడ ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాల్లో గరుడ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రకటించడంతో ఆ విషయం సామాజిక మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం జరిగింది. నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయానికి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
బాలక్‌రామ్ దర్శనానికి పోటెత్తిన భక్తులు- మధ్యాహ్నానికే 3లక్షల మంది దర్శనం
Chilkur Balaji Brahmotsavam 2024 :ఆలయ కమిటీ అంచనాలకు మించి జనం పోటెత్తడంతో నగరంలోని లంగర్ హౌజ్ నుంచి మొదలు ఓఆర్ఆర్, పోలీస్‌అకాడమీ జంక్షన్, అజీజ్ నగర్, చిలుకూరు చౌరస్తా మీదుగా ఆలయం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఆ మార్గంలో చేవెళ్ల, వికారాబాద్ వెళ్లే సాధారణ వాహనదారులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న మొయినాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ దశలో ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులెత్తేశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అదనపు సిబ్బందితో ఆలయానికి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. భక్తులను నడిచి వెళ్లాల్సిందిగా సూచించడంతో సుమారు ఐదారు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ప్రసాదం కోసం పోటీపడ్డారు.