Essential Commodities Prices Hikes :వేతనజీవులు నెల జీతాన్ని ప్రణాళికతో వెచ్చిస్తుంటారు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు పక్కాగా ప్రణాళిక వేసుకుంటారు. కొన్నాళ్లుగా పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో వేతన జీవులు లోటు బడ్జెట్‌ను ఎదుర్కొంటున్నారు. సిద్దిపేటకు చెందిన నరేశ్ చిరుద్యోగి. చాలీచాలని వేతనంతో ఆరుగురి కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. ప్రతి నెలా ఖర్చులకు ప్రణాళికతో వెచ్చిస్తుంటాడు. కొన్నాళ్లుగా పెరిగిన ధరలతో లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్నాడు. నిత్యావసర ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రతి నెలా రూ.3 వేలు ఖర్చు చేయగా, కొన్నాళ్లుగా ఆ లెక్క రూ.4,500కు పెరిగింది.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు బియ్యం ఉడకనంటోంది, నూనె ధర చేజారుతోంది, పప్పు బద్దకిస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో బేజారవుతున్నారు. ప్రతి నెలా పెరిగిన నిర్వహణ ఖర్చులతో కుటుంబ సారథి, ఇంటిని వెళ్లదీసేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కొన్నాళ్లుగా పెరుగుతున్న ధరలతో షాక్‌కు గురవుతున్నారు. పెద్ద పండగలైన దసరా, దీపావళి వచ్చేశాయి. పండగల వేళ ప్రజలంతా ఇబ్బందులకు గురవుతున్నారు.
దడ పుట్టిస్తోంది :మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరలు భయం పుట్టిస్తున్నాయి. సగటున క్వింటాకు రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి. నెల రోజుల వ్యవధిలో పెరుగుదల ప్రభావం చూపింది. ఐదుగురు సభ్యులున్న ఉన్న కుటుంబంలో నెలకు కనీసం 40 నుంచి 50 కిలోల బియ్యం అవసరమవుతాయి. పాత సన్నబియ్యం ధరలు భారీగా పెరగడంతో దొడ్డు బియ్యం వైపు మొగ్గుచూపుతున్నారు.