Pradesh Election Committee Meeting : తెలంగాణలో రాబోయే లోక్ సభ ఎన్నికల అభ్యర్ధులను నిర్ణయించే సర్వాధికారాలను హైకమాండ్‌కు అప్పగిస్తూ ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ హామీలు అమలవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ సీట్లు గెలవాల్సి ఉందని, ఇందుకు అందరూ కలిసి పని చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు.
ఇవాళ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ(PEC) సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీతోపాటు ఏఐసీసీ(AICC) కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
CM Revanth Reddy on Lok Sabha Elections : ఈ సమావేశంలో లోక్ సభ అభ్యర్ధులతో పాటు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై కూడా చర్చించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ఆశావహుల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేసినట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన ఆశావహులు ఫిబ్రవరి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు రూ.50,000 కాగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 25 వేలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం వాయిదా వేసి కుట్రకు తెరలేపారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లి సభ నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్-బీజేపీ ఒకటేనని మాట్లాడడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు.