Pawan criticizes YSRCP govt: ఈనెల 30న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొన్న పవన్, వైసీపీపై నిప్పులు చెరిగారు.పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి మాత్రం పక్క జిల్లాల్లో దోచుకోవచ్చు కానీ, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి జిల్లాలోకి బయటవాళ్లను రానివ్వరని విమర్శించారు.
వంతాడ అక్రమ మైనింగ్‌ను క్రమబద్ధీకరిస్తామని పవన్ హామీ ఇచ్చారు, గిరిజనుల గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తానని తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆధునిక ఆస్పత్రులు నిర్మించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.450 కోట్లు దోచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, రోడ్లుపై ప్రయాణించాలంటే వెన్నెముక విరిగేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జగన్ సారా అమ్ముతూ రూ.40వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ద్వారంపూడి ప్రత్తిపాడులో అడుగుపెట్టాలంటే వందసార్లు ఆలోచించాలని ఎద్దేవా చేశారు. జనసైనికులకు ఉన్న దమ్ము, ధైర్యం వల్లే గూండా పార్టీని తట్టుకుంటున్నానని తెలిపారు. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కిడ్నీలు, నరాలు దెబ్బతినేలా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. మద్యం నిషేధిస్తామని, ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని ఎద్దేవా చేశారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని తెలిపారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యమని తెలిపారు.