Parked Cars Theft Telangana 2024 :ఆగి ఉన్న వాహనాలే వాళ్ల టార్గెట్. పని మీద పార్కింగ్ చేసి వెళ్లావో అంతే సంగతి. ఆ కేటుగాళ్ల కన్ను పడిందంటే చాలు కార్లలో ఉన్నది ఏదైనా సరే, ఎంతైనా సరే ఇట్టే కొట్టేసి మాయమైపోతారు. వాహనాదారులను ఓ కంట కనిపెడుతూ అనుమానం రాకుండా కారు అద్దాలు పగల గొట్టి అందులో ఉన్న విలువైన పత్రాలు, డబ్బులు, చరవాణులు ఇలా ఏవైనా విలువైన వస్తువులు ఉన్నాయో ఇక అంతే సంగతి. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకొని అద్దాలు పగల గొట్టి డబ్బులు దొంగిలించే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం : నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన పిట్ల మహేశ్(36), ఆవుల రాకేశ్(26) గత కొంత కాలంగా రాష్ట్రంలోని దొంగతనం చేస్తున్నారు. వీరు రోడ్లపైగానీ, బ్యాంకుల ముందుగానీ పార్క్ చేసిన కార్లను గమనించి ఆ వాహనాల అద్దాలు పగలకొట్టి విలువైన వస్తువులు, నగదును దొంగలిస్తున్నారు.
ఈరోజు ఉదయం బాదలాపురం బస్టాండ్ వద్ద కోదాడ-జడ్చర్ల హైవే(Highway) 167 రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ. 2.77 లక్షలు నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక కారు, ఇతర పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని రూరల్ వన్ టౌన్ పీఎస్‌లో నిందితులపైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
'నిందితులు చాలా రోజుల నుంచి రెండు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్నారు. 2023, 2024లో వీరి మీద మిర్యాలగూడలో ఫిర్యాదు వచ్చింది. ఆ కేసులో సుమారు 6 లక్షల నగదు పోయింది. పోలీసులు అందరూ టీమ్‌గా ఏర్పడి నిందితులను అరెస్టు చేశాం.'- రాజశేఖర్ రాజ, మిర్యాలగూడ డీఎస్పీ