Parents Protest At Jeevadan School In Kamareddy :కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ పాఠశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పీఈటీ నాగరాజు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసులు పీఈటీపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు పాఠశాలకు చేరుకుని మద్దతుగా నిలిచారు. ఆందోళనలో పాల్గొని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సముదాయించినా వినకపోవడంతో కాసేపటికి డీఎస్పీ నాగేశ్వర్రావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విద్యార్థి సంఘాల ఆందోళనలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడంతో పాఠశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పాఠశాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పాఠశాలలో ఉద్రిక్తత నేపథ్యంలో విద్యార్థులను బయటకు పంపించారు. దాంతో వారు కూడా ఆందోళనలో పాల్గొని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.