Son Harassing Parents In Hanamkonda: ఈ రోజుల్లో కనిపెంచిన తల్లిదండ్రులను పోషించడానికి భారంగా ఫీలవుతున్నారు పిల్లలు. గుండెల మీద పెట్టుకుని పెంచిన వారికి బుక్కెడు అన్నం పెట్టడానికి మనసు రాక వీధిన పడేస్తున్నారు. కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండా వారు సంపాదించిన ఆస్తిపాస్తులను లెక్కలేసుకుని బతుకుతున్నారు. జల్సాలకు అలవాటుపడి, వారు సంపాదించిన ఆస్తులపై కన్నేస్తున్నారు. ఆస్తులు పంచేదాకా వారిని ఏదోరకంగా హింసిస్తున్నారు. కన్న కుమారుడే ఆస్తికోసం తమని బెదిరించడంతో వారి గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియక ఎందరో తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హనుమకొండలో జరిగింది.
తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడు :హనుమకొండ బాలసముద్రం ప్రాంతానికి చెందిన బిట్ట శేఖర్, భాగ్యలక్ష్మి దంపతులకు ఆరుగురు కుమారులు. ఇద్దరు చనిపోగా నలుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఒక్క కుమారుడు మాత్రం వీరిని హింసించడమే పనిగా పెట్టుకున్నాడు. వీరికి ఏకైక జీవనాధారం హనుమకొండ టైలర్ స్ట్రీట్‌లోని నగల దుకాణం.
ఆ దుకాణాన్ని నిర్వహించుకుంటూ తన కుమారులను ప్రయోజకులను చేశారు ఈ దంపతులు. ఈ దుకాణంపై కన్నేసిన కుమారుడు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. దీంతో తాము ఎలా జీవనం సాగించాలని తల్లిదండ్రులు ప్రశ్నించగా, సూటిపోటి మాటలతో నిత్యం వేధిస్తున్నాడు. నిలదీసిన తల్లిదండ్రులపై రౌడీలను ఉసిగొల్పుతూ కర్కశత్వాన్ని చాటుతున్నాడు.