Panchayat Secretaries who Got teaching jobs :పంచాయతీ కార్యదర్శులు ఇన్ని రోజులు గ్రామాల్లో పని చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు కొలువు కొట్టి పిల్లలకు పాఠాలు చెప్పబోతున్నారు. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, రోడ్ల మరమ్మతులు, ధ్రువీకరణ పత్రాలు, అనుమతుల జారీ విధులు నిర్వర్తించారు. ఇకపై వారు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 111 మంది పంచాయతీ కార్యదర్శులు డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఇందులో 70 మంది ఎస్జీటీలు కాగా, 41 మంది స్కూల్ అసిస్టెంట్లు. నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 11 మంది, కామారెడ్డి నుంచి 10 మంది, జనగామ జిల్లా నుంచి 9 మంది పంచాయతీ కార్యదర్శులు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు.
భారీగా ఖాళీలు : 111 మంది పంచాయతీ కార్యదర్శులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. గ్రూపు-4 ఉద్యోగాల మెరిట్ జాబితాలో 200 మంది ఉన్నారు. గ్రూపు-2, గ్రూపు-1లకు చాలా మంది సన్నద్ధమవుతున్నారు. ఆయా పరీక్షల ఫలితాలు వచ్చాక ఖాళీలు మరిన్ని పెరగనున్నాయి. పంచాయతీ కార్యదర్శులకు పని భారంతో పాటు వేతనాలు తక్కువగా ఉన్నాయి. వెయ్యి మందికి పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అయిదేళ్లుగా పని చేస్తున్నా, క్రమబద్ధీకరణ జరగలేదు. ఈ కారణాలతో చాలా మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారిస్తున్నారు.