Online Game Fraud in Telangana: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది. ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తెలియక మొబైల్‌తోనే ఎక్కువగా గడుపుతున్నారు. మనం సరదాకి ఏదైనా రీల్స్ చూసినా, వెబ్సైట్లు సెర్చ్ చేసినా కొన్ని యాడ్స్ రూపంలో గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కనిపిస్తాయి. మరికొన్ని వెబ్సైట్ల మాదిరిగా, యాప్‌లుగా ప్రత్యక్షమవుతాయి.
మనల్ని ఆకర్షించడానికి సరదాగా గేమ్ అడుతూ డబ్బులు సంపాదించుకోండి, గెలిచిన డబ్బును క్షణాల్లోనే నేరుగా మీ ఎకౌంట్లోకి నగదు చేరుతుందని వస్తుంటాయి. వీటిని చూసి ఆ సమయంలో కొంతమంది గేమ్ ఆడడం మొదలు పెడుతున్నారు. ఆ గేమ్ ఆడుతున్న మధ్యలో మరింత రసవత్తరంగా ఉండేందుకు టాస్క్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు యూజర్స్‌కు వల వేస్తుంటారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది.
Cyber Criminals Attract People to Online Game : సరదాగా ఆడిన గేమ్ కాస్త టాస్క్(Attract Online Game Tasks)ల మోజులో పడి సైబర్ నేరగాళ్లు మనీ అడిగితే ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు కొందరు. దీంతో చివరికి కోట్లల్లో, లక్షల్లో డబ్బుల పోగొట్టుకుని మోసపోతున్నారు. వీరిలో పాఠశాల విద్యార్థుల నుంచి గృహిణుల వరకు ఎక్కువగా మోసపోతున్నారు. ఎంతగా అవగాహన కల్పించినా ఇలాంటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదని పోలీసులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఆన్‌లైన్ గేమింగ్ మోసాలు - ఖాతాల్లో సొమ్ము కొల్లగొడుతున్న కేటుగాళ్లు
హైదరాబాద్ నగర పరిధిలో గడిచిన 20 రోజుల్లోనే సైబర్ నేరస్థుల చేతిలో సుమారు రూ.10 కోట్లు నష్టపోయారు. వీరిలో ఆన్‌లైన్ గేమ్స్ బాధితులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పని చేసే ప్రదేశాల్లో పోలీసులు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇన్ని చేసినా ఏదో ఒక రూపంలో మోసపోయే బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఆటకు బానిసలైన కొందరు గేమ్స్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నేరస్థులుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నారు.