Ganesh Immersion at Tank Bund :ట్యాంక్‌బండ్‌పై వినాయకుల నిమజ్జనాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై అధికారులు యూటర్న్ తీసుకున్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆందోళనతో అధికారులు దిగి వచ్చారు. హుస్సేన్‌సాగర్‌లో వినాయకుల నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన భారీ గేట్లు, నిమజ్జనం చేయకూడదని సూచిస్తూ పెట్టిన ఫ్లెక్సీలను తొలగించారు. హుస్సేన్‌సాగర్‌లో గణపతులను నిమజ్జనం చేయడానికి క్రేన్లను రంగంలోకి దింపుతున్నారు.
ఉత్సవ సమితి ఆందోళన :అంతకుముందు హుస్సేన్‌సాగర్‌లో వినాయకుల నిమజ్జనాన్ని నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతికి హాని కలిగించే విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని కోర్టు సైతం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిమజ్జనం సాఫీగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం, ట్యాంక్‌బండ్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి నిషేధించడం సరికాదని మండిపడ్డారు.
Ganesh Nimajjanam At Hussain Sagar :ఈ క్రమంలో ట్యాంక్‌బండ్‌పై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి, భక్తులతో ఉత్సవ సమితి సభ్యులు గణేశ్ నిమజ్జనం చేయించారు. ఈ రోజు సాయంత్రం వరకు నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చెయ్యకపోతే సోమవారం నగర వ్యాప్తంగా నిరసన చేపడుతామని వారు హెచ్చరించారు. ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన భక్తులతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయించారు.