Hydra Demolitions in Ameenpur : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఐలాపూర్ తాండా సర్వేనంబర్ 119లో దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకొని వెంచర్లు వేశారు. అక్రమాలపై హైడ్రా, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు.
మరిన్ని కూల్చివేతలు : పోలీసులు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. అక్రమిత భూముల్లో ప్లాట్లుకొని మోసపోవద్దని ప్రజలకు రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు హైడ్రా అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేశామని తహశీల్దార్ రాధ స్పష్టం చేశారు. త్వరలో సర్వే చేసి మరిన్ని అక్రమ కట్టడాలను గుర్తించి నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు.
మున్సిపల్ చైర్మన్ అక్రమ కట్టడాలు : అమీన్‌పూర్‌లో ఓప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ, ఆటస్థలాన్ని నేలమట్టం చేశారు. ప్రొక్లెయిన్ సహాయంతో ప్రహరీని కూల్చి దాదాపు 15 గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 462లో 38 గుంటల ప్రభుత్వ భూమిలో వెలసిన దుకాణాలను తొలగించారు. ఆ దుకాణాలు స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డివిగా గుర్తించిన అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు.