Not Allowing Vehicles to Maharashtra From Telangana :రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజులు నుంచి కురుస్తున్న భారీవర్షాలకు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న బ్రిడ్జిని ఆనుకుని ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిపేశారు. ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈ మేరకు బోధన్ మండలంలోని ఖండ్గాం నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు గోదావరి వైపునకు రావొద్దని హెచ్చరించారు.
మరోవైపు భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్, కడెం, సమ్మక్క సారక్క తుపాకులగూడెం బ్యారేజీల గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేసి దిగువ ప్రాంతానికి వరద నీరు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. టేకులగూడెం వద్ద 163వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ -ఛత్తీస్గఢ్ అంతర్ రాష్ట్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు గోదావరి ప్రవాహానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మర్రి వాగు, కొంగలవాగు బ్రిడ్జిలు నీట మునిగాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
'మహారాష్ట్రలోని ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ-మహారాష్ట్ర రాకపోకలు నిలిపివేశాం. ప్రజలు ఎవరూ కందకుర్తి బ్రిడ్జ్ వద్దకు రావొద్దని పోలీసుల తరుఫున కోరుకుంటున్నా'- పోలీసు అధికారి