National Sample Survey In Telangana :రాష్ట్రంలో 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా ఫోన్లు లేనిదే అన్నం తినడం లేదు. అంతేకాకుండా 18 ఏళ్లు నిండిన వారిలో 42.4 శాతం మంది అప్పుల్లో ఉన్నారు. దేశం సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇక కుటుంబసభ్యుల్లో ఎవరైనా ఆసుపత్రి పాలైతే ఆయా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో కుంటుంబాలపై ఈ భారం ఎక్కువగా ఉంది. ఈ వివరాలన్నింటినీ జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిలో 8758 గ్రామాలు, 6540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై ఆరోగ్యం, అప్పులు, మొబైల్, ఇంటర్నెట్, విద్య తదితర అంశాలపై సర్వే నిర్వహించింది. తెలంగాణలో పరిస్థితులనూ విశ్లేషించింది.
స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే : తెలంగాణలో 15 ఏళ్లు పైబడిన వారిలో 92.3 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ వాడకంపై అవగాహన ఉంది. గ్రామాల్లో 90.7 శాతం, పట్టణాల్లో 94.5 శాతం మంది మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. వీరిలో పురుషులు 96.4%, మహిళలు 88.2% ఉన్నారు. వీరందరి సిమ్‌కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి.
అప్పుల్లో ప్రజలు : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రజల్లో ఎక్కువ మంది అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. వీరిలో చాలా మంది అప్పులు తీసుకుంటున్నారు. తీసుకున్న ఆ సొమ్మును తిరిగి చెల్లించేందుకు పనులు ఉండట్లేదు. దీంతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతి లక్ష మందికి 42,407 మంది అప్పుల్లో ఉండటం గమనార్హం. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామాల్లోనే అప్పులున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్రతి లక్ష మందిలో గ్రామీణ ప్రాంతాల్లో 50,289 మంది, పట్టణాల్లో 31,309 మంది అప్పుల్లో ఉన్నారు.