తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన మద్యం విధానంపై నేడో రేపో నోటిఫికేషన్‌ - ANDHRA PARADESH LIQUOR POLICY 2024

New Liquor Shops Notification in AP : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో మద్యం విధానంపై నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రిటైల్‌ వ్యాపారాన్ని ప్రైవేట్​కు అప్పగించే ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ అబ్దుల్​ నజీర్​ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు అక్టోబర్​లో బహిరంగ టెండర్ల ద్వారా లైసెన్సుల జారీ పూర్తిచేసేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది.

AP LIQUOR NOTIFICATION
AP NEW LIQUOR POLICY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 3:02 PM IST

New Liquor Policy in AP :ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇవాళ సాయంత్రం లేదా మంగళవారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది. మద్యం రిటైల్‌ వ్యాపారాన్ని ప్రైవేట్​కు అప్పగించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్, ఫారిన్‌ లిక్కర్‌ చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సంతకం చేసి ఆమోదం తెలిపారు.

ఈ ఆర్డినెన్స్‌ దస్త్రం గవర్నర్‌ కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది. ఆ శాఖ దీనికి సంబంధించి గెజిట్‌లో నోటిఫికేషన్‌ను ఇవాళ ప్రచురించనుంది. ఈ చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే నూతన మద్యం విధానం విధివిధానాలు, అర్జీల స్వీకరణ, లాటరీ తీసి లైసెన్సుదారులను ఎంపిక చేసే తేదీల వివరాలతో ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులను విడుదల చేయనుంది. అక్టోబర్​ 10, 11 తేదీల నాటికి లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. ఆ వెంటనే కొత్త మద్యం దుకాణాల విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

2019 జూన్‌ కంటే ముందు ఆంధ్రప్రదేశ్​లో మద్యం రిటైల్‌ వ్యాపారాన్ని ప్రైవేట్​ వ్యాపారులే నిర్వహించేవారు. సర్కార్ వారికి లైసెన్సులు జారీ చేసేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం రిటైల్‌ వ్యాపారాన్ని రాష్ట ప్రభుత్వం తరఫున ఏపీఎస్‌బీసీఎల్‌ లేదా ఇతర ప్రభుత్వ కార్పొరేషన్‌ ఏదైనా మాత్రమే నిర్వహించేలా చట్టాన్ని మార్చేశారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ వ్యాపారానికి చట్ట ప్రకారం అవకాశం లేకుండా చేశారు.

గౌడ కులానికి 340 మద్యం దుకాణాలు! :కూటమి ప్రభుత్వం రిటైల్‌ వ్యాపార నిర్వహణను ప్రైవేట్​కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మార్చేసిన చట్టాన్ని మళ్లీ సవరించాల్సి వచ్చింది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేకపోవటంతో ఆర్డినెన్స్‌ తీసుకొస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, పదజాలాల్లో స్వల్ప తేడాల వల్ల వాటిని మార్చాలంటూ ఆ దస్త్రాన్ని న్యాయశాఖ వెనక్కి పంపించింది. వాటిని సరిచేసిన అనంతరం గవర్నర్‌ కార్యాలయానికి పంపగా తాజాగా అక్కడ ఆమోదం లభించింది. మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వీటిలో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది.

Telangana Wine Shops Lucky Draw : ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల లైసెన్స్​ల టెండర్​ ప్రక్రియ

నూతన బార్‌ పాలసీ ప్రకటించిన సర్కార్​.. మద్య నిషేధం హామీ ఊసేదీ..?

ABOUT THE AUTHOR

...view details