తెలంగాణ

telangana

ETV Bharat / state

కనిపించుట లేదు : ఆ ఊర్లన్నీ ఏమయ్యాయి! - ఆ జనమంతా ఎటెళ్లారు!! - NO RESIDENCES 15 VILLAGES

జన సంచారం లేని గ్రామాలు.. కానీ దస్త్రాల్లో ఊర్ల పేర్లు - నిజామాబాద్​ జిల్లాలో జనసంచారం లేని పల్లెలు 15

NO RESIDENCES IN 15 VILLAGES
No Residences in Villages but in Revenue Records (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

No Residences in Villages but in Revenue Records : అక్కడ నివాసాలు ఉండవు, జన సంచారం అసలే ఉండదు. కానీ ఊరి పేరు మాత్రం అధికారుల దస్త్రాల్లో పదిలంగా ఉంటుంది. అదేంటి? జనం లేని ఊరు ఉంటుందా అసలు అని అనుకుంటున్నారా? అయితే మీరు చూస్తుంది నిజమే. అక్కడ ఒకప్పుడు ప్రజలు నివాసం ఉన్న గ్రామాలు, కొన్ని కారణాలతో ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. అయినా ఆ గ్రామాల పేర్లు మాత్రం అలాగే ఉండగా, అక్కడే రైతులకు పొలాలు కూడా ఉండటం గమనార్హం.

నిజామాబాద్​ జిల్లాలో సుమారు 453 రెవెన్యూ గ్రామాలు ఉండేవి. వివిధ కారణాలతో దాదాపు 15 పల్లెల్లో జనావాసాలు లేకుండా పోయాయి. వీటిలో ఏడు గ్రామాలు ప్రాజెక్టుల కింద నీట మునిగాయి. మరో ఏడు ఊళ్లళ్లో సాగు భూములు మాత్రమే ఉన్నాయి. నిజాం పాలన కాలం నాటి నుంచే జనం లేని ఊర్లు రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రికార్డుల ఆధారంగా సదరు రెవెన్యూ గ్రామం పేరుపైనే రైతులకు పట్టా పాస్‌ పుస్తకాలు ఇస్తున్నారు. ఆ గ్రామాల పేరుతోనే భూముల లావాదేవీలూ సాగుతుంటాయి.

కొన్ని గ్రామాలు నీట మునిగాయి : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో కొన్ని గ్రామాలు నీటమునిగాయి. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీరుంటే ఇవేవీ కనిపించవు. కానీ దస్త్రాల్లో మాత్రం భద్రంగా ఉన్నాయి. నందిపేట్‌ మండలం శ్రీరాంపూర్, కుస్తాపూర్, బాల్కొండ మండలం రత్నాపూర్, సంగం, కేశాపూర్, కొజన్‌ కొత్తూరు, ఆర్మూర్‌ మండలం బర్దీపూర్‌ గ్రామాలు ముంపునకు గురై రికార్డులో కొనసాగుతున్న జాబితాలో ఉన్నాయి.

నివాసాలకు అవకాశం :ఇటీవల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు అభివృద్ధి చెందడంతో పాటు రవాణా సదుపాయాలు పెరిగాయి. దీంతో పల్లెల్లోనూ స్థిరాస్తి వ్యాపారం జోరుగా జరుగుతుండగా వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కనుమరుగైన రెవెన్యూ గ్రామాలు కూడా ప్రస్తుతం డిమాండ్​ ఉన్న జాబితాలో చేరుతున్నాయి. అక్కడ కూడా వెంచర్లు వస్తే, మళ్లీ ఆ గ్రామాల్లో జనసందోహం కనిపించే అవకాశం ఉంది.

మచ్చుకు కొన్ని..

  • నిజామాబాద్​ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి సమీపంలో సుమారు 40 ఏళ్ల క్రితం లక్ష్మాపూర్‌ గ్రామం ఉండేదని స్థానికులు అంటున్నారు. కాలక్రమేణా ఆ గ్రామం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఆ ఊరుకు ఆనుకుని ఓ గుట్ట ఉండేదని, దాని భయంతోనే ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపారు. కానీ రికార్డుల్లో మాత్రం ఆ రెవెన్యూ గ్రామం అలాగే ఉంది. చౌట్‌పల్లికి చెందిన రైతులకు దాదాపు 734 ఎకరాల సాగు భూమి ఇప్పుటికీ ఆ ఊరి పేరుపైనే ఉంది. అక్కడి రైతులను మీది ఏ ఊరు అని అడిగితే ఇప్పటికీ చౌట్‌పల్లి అని అంటారు. పొలం ఎక్కుడుందని అడిగితే లక్ష్మాపూర్‌ శివారులో ఉందంటూ చెబుతారు.
  • ధర్పల్లి మండలం రామడుగులోని కోనాయిపల్లి అనే రెవెన్యూ గ్రామం ఉంది. రామడుగు, లోలం, మల్లాపూర్ గ్రామాల వారికి అక్కడ పొలాలున్నాయి. కానీ కోనాయిపల్లి ఆనవాళ్లు మాత్రం లేవు.
  • వర్ని మండలం బాజీదాపూర్, సిరికొండ మండలంలో గిరిగేపహాడ్, కమ్మర్‌పల్లి మండలం రేచ్‌పల్లి, గుంటెపల్లి, బేలూరు, బోధన్‌ మండలం లాడ్‌ మావంది గ్రామాలు అసలు కనిపించవు. కానీ ఇంకా రెవెన్యూ దస్త్రాల్లో మాత్రం పదిలంగా ఉన్నాయి.

1957 వరకు ఆ గ్రామం ఉండేది : 1957 వరకు కోనాయిపల్లి అనే గ్రామం ఉండేదని మల్లాపూర్​కు చెందిన రాము తెలిపారు. అక్కడ తక్కువ ఇళ్లు ఉండడంతోనే మల్లాపూర్‌కు వచ్చినట్లు చెప్పారు. ఇంకా భూములు మాత్రం కోనాయిపల్లి పేరుపైనే ఉన్నాయని వివరించారు. ఈ శివారు ధర్పల్లి మండల పరిధికి వస్తుందని, ఇందల్‌వాయిలో కలపాలని ఎప్పటినుంచో వినతులు ఇస్తున్నా స్పందన లేదని పేర్కొన్నారు. ఏదైనా పని ఉంటే దాదాపు 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.

సమస్యలు ఉంటే పరిష్కారానికి చొరవ చూపిస్తాం :ఎస్సారెస్పీ ముంపు గ్రామాల దస్త్రాలు ఇంకా తమ వద్దే ఉన్నాయని ఎస్సారెస్పీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్ తెలిపారు. ఆ గ్రామాల్లో నివాసం ఉండి, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి తాము చొరవ చూపిస్తామని వెల్లడించారు. నిర్మల్​ ప్రాంతంలో ఉన్న దస్త్రాలను సైతం జిల్లాకు తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ దస్త్రాల్లో ఉన్న పొరపాట్లను సరి చేస్తామని పేర్కొన్నారు.

'పసుపు'మయంగా మారిన ఆ గ్రామం - అసలు కథ ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details