Six Year old Boy Suffering by Zika Virus : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో ఓ ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అక్కడి ప్రజలు అనుక్షణం భయంతో కాలం గడుపుతున్నారు. జికా వైరస్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రెండ్రోజులుగా స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జికా వైరస్ సోకిన ఆరేళ్ల బాలుడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుణె ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఇంకా నివేదిక అందలేదు. వెంకటాపురం గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయని స్థానికులు తెలిపారు.
కనిపించని అధికారులు, వైద్యులు : వెంకటాపురంలో జికా వైరస్ లక్షణాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. వైద్యులైతే ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని వాపోయారు. జికా వైరస్ భయంతో ఉపాధ్యాయులు కూడా తమ గ్రామానికి రావడంలేదని, దీంతో ప్రభుత్వం పాఠశాలలు తెరుచుకోవడంలేదని తెలిపారు. ఇది ఇలా ఉండగా జికా వైరస్‌తో బాధపడున్న తమ కుమారిడిని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.