Body Detoxification in Ayurveda: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తయారయ్యే మలినాలు ఎప్పటికప్పుడూ బయటకు వెళ్లిపోవాలి. కానీ, కొన్ని సార్లు మలినాలు శరీరంలోనే పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతుంటాం. అయితే, ఈ సమస్యకు ఆయర్వేదంలో చక్కని పరిష్కార మార్గం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు బియ్యం నూకలు
- ఒక చెంచా త్రిఫల చూర్ణం
- ఒక చెంచా త్రికటుకాలు
- ఒక చెంచా వాము చూర్ణం
- ఒక చెంచా విడంగాల చూర్ణం
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో బియ్యం నూకలను తీసుకుని దానికి 8 రెట్లు నీటిని పోసి వేడి చేసుకోవాలి.
- మరో గిన్నెలో త్రిఫల చూర్ణం, త్రికటుకాలు, వాము, విడంగాల చూర్ణం వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మరుగుతున్న జావాలో వేసి నిమిషం పాటు ఉడికించుకోవాలి. అవసరమైతే రుచి కోసం సైంధవ లవణం కూడా కలుపుకోవచ్చు.
- అనంతరం స్టౌ ఆఫ్ చేసుకుని కాస్తే వేడి తగ్గిన తర్వాత గోరు వెచ్చగా తీసుకోవాలి.
- ఈ ఔషధాన్ని వారంలో ఒక్క రోజు తీసుకుంటే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయని గాయత్రీ దేవీ చెబుతున్నారు.
- ఇంకా లివర్, కొలెస్ట్రాల్, షుగర్ లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వారంలో రెండు సార్లు ఈ ఔషధాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
త్రిఫలాలు: కరక్కాయాలు, తానికాయలు, ఉసిరి కాయలను కలిపి త్రిఫలాలు అంటారు. ఇవి శరీరంలోని మలినాలను విరేచనాల ద్వారా బయటకు పంపడంలో సహాయ పడుతుందని చెబుతున్నారు. శరీరంలో మలినాలు అరగకుండా రక్త నాళాల్లో, కణజాలాల్లో ఉంటే వాటిని మలద్వారం గుండా బయటకు పంపిస్తాయని వివరిస్తున్నారు.
త్రికటుకాలు: శొంఠి, పిప్పళ్లు, మిరియాలను కలిపి త్రికటుకాలు అంటారు. వీటికి జీర్ణ శక్తిని మెరుగుపరిచే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు మలినాలు బయటకు పంపించడంలోనూ ఉపయోగపడుతుందని అంటున్నారు.
వాము: జీర్ణ శక్తిని పెంచడంలో వాము చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు వాయు రూపంలో ఉన్న మలినాలను కూడా బయటకు పంపిస్తుందని చెబుతున్నారు.
విడంగాలు: విడంగాలు శరీరానికి మేలు చేసే టానిక్‌లాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలోని నులి పురుగుల లాంటి సూక్ష్మ జీవులు ఉంటే వాటిని బయటకు తీసుకువస్తాయని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజుకో పెగ్గు ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
మీకు నిద్రలో చెమటలు పడుతున్నాయా? లేట్ చేయకుండా ఆస్పత్రికి వెళ్తే బెటర్!