Saree Scam at Indrakeeladri :విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణం పక్కదారి పట్టింది. సుమారు 1.67 కోట్ల విలువైన చీరల మాయం ఉదంతంలో నివేదికను గత వైఎస్సార్సీపీ పాలకులు తొక్కిపెట్టేశారు. ఏకంగా 33,686 చీరలు కనిపించకుండా పోయాయని అధికారులు తేల్చారు. అయినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. గత సర్కార్‌లోని పెద్దలను పట్టుకుని అక్రమార్కులు తప్పించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా కొత్త అధికారులొచ్చినా ఇప్పటికీ కోట్ల రూపాయల విలువైన చీరల మాయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు దీంతో సంబంధం లేనట్లు దేవాదాయ శాఖ వ్యవహరిస్తోంది.
చీరల విభాగంలో 2019 అక్టోబర్‌లో నగదు పరిశీలించగా రూ.11.61 లక్షలు తేడా ఉన్నట్లు తెలిసింది. దీనికి 2018 మే నుంచి 2019 ఆగస్టు వరకు చీరల విభాగంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యమే కారణమని భావించి ఐదు అభియోగాలతో సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత కమిషనర్ కార్యాలయంలో చక్రం తిప్పి 2020 మార్చి నెలలో తిరిగి విధుల్లో చేరిపోయారు. 2022 జూన్‌లో ఆడిట్ సమయంలో రూ.6,49,000ల విలువైన 77 పట్టుచీరలు మాయమైన విషయాన్ని గుర్తించారు. దీనికి సుబ్రహ్మణ్యమే కారణమని భావించి ఏడు అభియోగాలతో మళ్లీ సస్పెండ్ చేశారు.
చీరల విభాగంలో అక్రమాలపై విచారణ జరిపేందుకు ఏఈఓ పి.సుధారాణి ఆధ్వర్యంలో 2022 డిసెంబర్‌లో కమిటీ వేశారు. రికార్డులన్నీ పరిశీలించాక చీరల విభాగంలో ఇంఛార్జ్‌గా సుబ్రమణ్యం ఉన్నప్పుడే కుంభకోణం జరిగిందని గుర్తించారు. రికార్డుల ప్రకారం ఏకంగా రూ.1.66 కోట్ల విలువైన 33,686 చీరలు గోదాములో మాయమయ్యాయని తేల్చారు. వాటికి సంబంధించిన ఇండెంట్లు, ఆర్డర్లు, అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఏవీ లేవని గుర్తించారు.