తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళా పోలీసులు ఉన్నారా ? అరెస్టు చేసిన వారిని కొట్టారా ?' - లగచర్ల ఘటనపై ఎన్​హెచ్​ఆర్సీ విచారణ

లగచర్ల ఘటనపై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ - దాడి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్న కమిషన్‌ అధికారులు

NHRC ON LAGACHARLA ENQUIRY
NHRC Inquiry on Lagacharla Attack Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

NHRC Inquiry on Lagacharla Attack Today : వికారాబాద్‌ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్​హెచ్​ఆర్సీ) విచారణ చేపట్టింది. స్థానిక గిరిజనులపై పోలీసులు దాడి చేశారని, అక్రమంగా అరెస్టు చేశారని ఎన్​హెచ్​ఆర్సీకి అందిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టింది. ఇప్పటికే లగచర్ల దాడిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఇవాళ లా విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేశ్​, ఇద్దరు ఇన్​స్పెక్టర్లు రోహిత్ సింగ్, ప్రకాశ్ శర్మ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాకు చేరుకుని క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టారు.

కలెక్టర్ లగచర్ల గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని, అధికారులపై దాడి, ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన తీరును కమిషన్​ అధికారులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు తమపై చేపట్టిన దౌర్జన్యాలను స్థానికులు వివరిస్తూ కమిషన్‌ ముందు వారి గోడు వెల్లబోసుకున్నారు. అర్థరాత్రి తమ ఇళ్లలోకి చొరబడి పోలీసులు తమ వాళ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారని వివరించారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేసి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.

మహిళా పోలీసులు వచ్చారా ? : పోలీసులు ఇళ్లకు వచ్చినప్పుడు మహిళా పోలీసులు ఉన్నారా ? అరెస్టు చేసిన వారిని కొట్టారా ? అని అధికారులు ఆరా తీశారు. దాడి జరిగిన రోజు పోలీసులు తమపై కూడా దాడి చేశారని, ఇంకా ఆ దెబ్బలకు నొప్పులతో బాధపడుతున్నామని స్థానికులు వివరించారు. తామంతా అణగారిన వర్గాలకు చెందిన వారిమని తమకు న్యాయం చేయాలని కమిషన్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఘటన జరిగిన రోజు గాయపడిన బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలని ఏఎన్​ఎంను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా లగచర్ల ఘటనపై విచారణ కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు లగచర్ల ఘటనపై సీఎస్, డీజీపీని రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్​హెచ్​ఆర్సీ ఆదేశించింది. నివేదికలో ఎఫ్‌ఐఆర్‌ల స్థితి, న్యాయ కస్టడీలో ఉన్న వ్యక్తుల వివరాలు, భయంతో అడవుల్లో దాక్కున్న గ్రామస్థుల వివరాలు ఉండాలని పేర్కొంది. గాయపడిన గ్రామస్థులకు వైద్య సహాయం అందించారా ? బాధిత మహిళలకు ఏదైనా వైద్య పరీక్షలు జరిగాయా ? అనే వివరాలు సైతం తెలియజేయాల్సిందిగా సూచించింది.

లగచర్ల ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం - గ్రామానికి రానున్న ప్రత్యేక బృందం

కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details