NGRI Team Visit Prakasam District:ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాలలో ఇటీవల వచ్చిన భూప్రకంపనల వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్జీఆర్ఐ బృందం స్పష్టం చేసింది. ఈనెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో వరుస భూప్రకంపనలు సంభవించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఎన్జీఆర్ఐ బృందం ముండ్లమూరు, తాళ్లూరులో పర్యటించి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఈ బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి భూస్థితిగతులను పరిశీలించింది.
గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతం అయిన ఈ ప్రదేశంలో 1967లో ఒకసారి భూకంపం సంభవించింది. మళ్లీ ఇన్ని రోజులకు ఇప్పుడు సంభవించడం వల్ల నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఇటీవల అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాల్లో మొదటిరోజు రిక్టర్ స్కేల్ పై 3.1 పరిమాణంతో వచ్చిన మాట వాస్తవమేనని, రెండు, మూడవ రోజు క్రమంగా ఆ తీవ్రత తగ్గుతూ వచ్చిందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త సురేశ్ అన్నారు. ఈ ప్రకంపనలపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఇవి కేవలం భూమి పై పొరలలో ప్రకంపనలు రావడం మూలంగానే ఈ శబ్దాలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి శబ్దాలు మాత్రమే రావడం వల్ల ప్రమాదాలకు సంకేతం కాదని తెలిపారు.
"నదిపరివాహక ప్రదేశమైన గుండ్లకమ్మ నది ఆవరణలో ఉండటం వలన ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనిపై పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.అధిక వర్షపాతం, వాతావరణ మార్పులు, భూ పరిభ్రమణంలో క్రమంగా వచ్చే మార్పుల వల్ల ఇవి సంభవిస్తాయి. దీనిపై అవగాహన లేనివారు మరొకరిని భయభ్రాంతులకు గురి చేయడం తగదు". - సురేశ్, ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త