Rangampet Pasuvula Panduga 2025 : తిరుపతి జిల్లా రంగంపేట సహా పలుచోట్ల పశువుల పండగ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పశువులను అందంగా అలంకరించి వీధుల్లోకి వదలి ఆటవిడుపు కలిగించారు. కోడెద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. పశువుల పండగను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలిరావడంతో పల్లెలు జనసంద్రంగా మారాయి.
ఉత్సాహంగా పశువుల పండుగ : ఆనవాయితీగా సాగుతున్న పశువుల పండగను తిరుపతి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించారు. కనుమ రోజున పశువులను అందంగా అలంకరించి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కపలకలు కట్టి వీధుల్లో వదిలారు. పశువులకు కట్టిన పలకలను దక్కించుకొనేందుకు యువకులు పోటీపడటం పశువులు బెదిరి పారిపోవడం వంటి వాటితో పశువుల పండగ ఆసక్తికరంగా సాగింది. పశువుల పండగను తిలకించడానికి జిల్లాతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. భవనాల పైకి చేరి కేరింతలు కొడుతూ ఆసక్తిగా వీక్షించారు.
చెక్కపలకలను సొంతం చేసుకొనేందుకు యువకుల పోటీ : పశువులను అదుపు చేసే ప్రయత్నంలో కొంత మంది గాయపడినా వాటిని లెక్క చేయకుండా కొమ్ములకు కట్టిన చెక్కపలకలను సొంతం చేసుకొనేందుకు యువకులు పోటీపడ్డారు. కోడె గిత్తలను పట్టుకునే ప్రయత్నంలో కొన్నిచోట్ల స్వల్పతోపులాటలు జరిగాయి. తమిళనాడు జలికట్టు మాదిరి కాకుండా పశువులను పూజించి బరిలోకి దించుతామని రైతులు తెలిపారు. పశువులతో ఉన్న అనుబంధానికి ప్రతీకగా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. కిక్కిరిసిన జనాల మధ్య పరుగులు పెట్టే పశువులను చూడటం కొత్త అనుభూతిని కలిగించిందని పశువుల పండగకు వచ్చిన వారు చెప్పారు. జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటతో పాటు పలు గ్రామాలలో పశువుల పండుగ నిర్వహించారు.
"కనుమ పండుగను చాలా బాగా జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఎద్దులను పూజించి పశువుల పండుగ చేసుకున్నాం. కోడెద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు.ఇది జల్లికట్టు కాదు సరదాగా జరుపుకునే పండుగ మాత్రమే." -గ్రామ ప్రజలు
తిరుపతి జిల్లాలో ఘనంగా పశువుల పండగ - గాయపడినా లెక్క చేయని యువత