Under Graduate Student From Vijayawada Gets Invitation for Republic Day Event : దిల్లీ ఎర్రకోట వేదికగా జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందాలంటే ఆషామాషీ కాదు. ఏ రంగంలోనైనా ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. లేదంటే మరేదైనా ప్రత్యేక గుర్తింపు పొంది ఉండాలి. అలాంటి అర్హతలు లేని ఓ కళాశాల విద్యార్థికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆహ్వానం లభించింది. ఎవరా యువకుడు. అతడికి అందిన ఆహ్వానం వెనక విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
దిల్లిలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని చాలామందికి ఉంటుంది. కానీ అనుమతి లేదా ఆహ్వానం తప్పనిసరిగా ఉండాలి. ప్రయత్నిస్తే అనుమతి ఎవ్వరికైనా లభించొచ్చు కానీ, రక్షణ శాఖ నుంచే ఆహ్వానం పొందాడీ యువకుడు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి 10 వేల నగదు బహుమానాన్నీ అందుకున్నాడు.
ఆ కుర్రాడి పేరు రాచకుల అమృత్ షాలింజోష్. విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో బీకామ్ (B.Com) కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రక్షణశాఖ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ ఆహ్వానం పత్రిక పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. జనవరి 26న దిల్లీలో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్నాడు.
రిపబ్లిక్ డే ఇన్విటేషన్ కార్డు పేరుతో రక్షణ మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ పోటీల్లో వందల మంది విద్యార్ధులు పాల్గొనగా 859 ఎంట్రీలను పరిగణనలోకి తీసుకుంది. అందులో తమిళనాడుకు చెందిన విద్యార్థి మొదటి స్థానం, అమృత్ రెండోస్థానం, హరియాణా విద్యార్థి మూడో స్థానంలో నిలిచి వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.
'ఆహ్వానపత్రికలతో పాటు 10వేల నగదును కేంద్రం నా ఖాతాలో జమ చేసింది. మువ్వన్నెల జెండా రెపరెపలతోపాటు జాతీయ వేడుకను తెలియజేసేలా ఇండియాగేట్, తాజ్‌మహల్, కుతుబ్ మినార్, రామమందిరం చిత్రాలు ఉండేలా ఆహ్వాన పత్రిక డిజైన్ చేశాను. నకిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించే వీలు లేకుండా 76వ గణతంత్ర దినోత్సవం-2025 పేరిట వాటర్‌మార్క్ డిజైన్ చేసి ద్వితీయ బహుమతి అందుకున్నాను.' -అమృత్ షాలింజోష్ (గణతంత్ర వేడుకలకు ఆహ్వానం పొందిన విద్యార్థి)
చిన్నతనం నుంచే డిజైనింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్న అమృత్ పలు డిజైన్ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే అనేక పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. కళాశాలలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికలు, ఇతర ప్రచార సామగ్రిని ఆకర్షణీయంగా రూపొందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.
బాల్యం నుంచే విద్యార్థుల్లో దేశభక్తి - స్కౌట్స్ అత్యుత్తమ శిక్షణ
గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రక్షణమంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానం పొందడం అరుదైన గౌరవం. అలాంటిది చిన్న వయసులోనే ఈ అవకాశం దక్కించుకున్నాడు అమృత్. అభిరుచికి అధునాతన టెక్నాలజీ జోడించే అరుదైన ఆహ్వాన పత్రికలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడీ క్రియేటివ్ డిజైనర్.
బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ - ఏపీ 'పర్యాటక శాఖ యూత్ ఐకాన్'గా ఇందిరా ప్రియదర్శిని