సంక్రాంతి సందడి ముగిసింది. పండుగ మూడు రోజులు కోళ్లు కత్తులు దూస్తే వేల కోట్ల రూపాయల్లో పందేలు సాగాయి. కోడిపందేలకు తోడు గుండాట, పేకాట, కోత ముక్క వంటి జూదక్రీడల్లో వందల కోట్లు చేతులు మారాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే 2వేల కోట్ల రూపాయలకుపైగా పందేలు జరిగాయి. మద్యం పరవళ్లు, మాంసాహార విందులతో ప్రతి బరి వద్ద పందెంరాయుళ్లు రెచ్చిపోయారు.
పండగ మూడు రోజులూ కోళ్లు కాలు దువ్వితే పందెంరాయుళ్లు నోట్ల కట్టలు పారబోశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కార్పొరేట్ స్థాయిలో బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. రాత్రి పూట కూడా ఫ్లడ్లైట్ల వెలుగులు, గెలుపోటములపై అనుమానాల్లేకుండా టీవీ రీప్లేలు, జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్లు, మద్యం పరవళ్లు, మాంసాహార విందులతో ప్రతి బరి వద్ద మూడు రోజులు పండగే అన్నట్లు సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దబరి, చిన్నబరి అనే తేడా లేకుండా కోడిపందేలు, జూద క్రీడలు జోరుగా సాగాయి. పెదఅమిరం, డేగాపురం, సీసలి, మహదేవపట్నం, అయిభీమవరం, కామవరపుకోట, కలిదిండి, దెందులూరు తదితర ప్రాంతాల్లో భారీ బరుల మధ్య పందేలు నిర్వహించారు.
కోళ్లు గెలిచిన డుగ్ డుగ్ బండ్లు - సంతోషంలో యజమానులు
తాడేపల్లిగూడెంలో : తాడేపల్లిగూడెం పట్టణంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందాల బరి వద్ద ఏకంగా కోటి 25 లక్షల రూపాయల పందెం జరిగింది. కుక్కుటశాస్త్రం ప్రకారం ముహూర్తం నిర్ణయించుకుని మరీ పందెం రాయుళ్లు తమ పుంజులను బరిలో దింపారు. గుడివాడ ప్రభాకర్రావుకి చెందిన నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు తలపడ్డాయి. 4 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పందెంలో గుడివాడ ప్రభాకర్రావుకి చెందిన నెమలి పుంజు విజేతగా నిలిచింది. కోటి 25 లక్షల ఈ పందేన్ని వీక్షించడానికి భారీగా జనం తరలివచ్చారు. పై పందాల రూపంలోనూ లక్షల్లో చేతులు మారాయి.
కత్తులు దూసిన కోళ్లు- కోట్లలో బెట్టింగ్లు- సంక్రాంతి సందడి అంతా బరుల్లోనే
ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం దుగ్గిరాలలో కోడి పందేలు అట్టహాసంగా ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుంచి అనేక మంది ఈ పందేలకు తరలివచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు సాగిన కోడి పందేలకు ఆటంకం లేకుండా దాదాపు 100 మంది బౌన్సర్లు, 300 మంది వాలంటీర్లను వినియోగించారు.
కొయ్యలగూడెం మండలంలో: ఏలూరు జిల్లా జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో కోడిపందాలు భారీ స్థాయిలో జరిగాయి. గుంటూరు జిల్లాకు చెందిన శివ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన బండారు నాని, జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కోడి పందేల్లో బుల్లెట్ బహుమతిగా గెలుచుకున్నారు.
కోనసీమ జిల్లాలో: కోనసీమ జిల్లాలో కోళ్ల కొట్లాటలో నోట్ల కట్టలు భారీగా చేతులు మారాయి. చివరి రోజు భారీ స్థాయిలో పందేలు జరిగాయి. మురమళ్లలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అతి పెద్దబరి కావడంతో వేలాది మంది వచ్చారు. గుండాట, ఇతర జూదక్రీడలు జోరుగా సాగాయి. మద్యం ఏరులై పారింది.
కత్తి కట్టొద్దని పోలీసులు హెచ్చరించినా పందెం రాయుళ్ల పంతమే నెగ్గింది
ఉమ్మడి కృష్ణజిల్లాలో : ఉమ్మడి కృష్ణజిల్లాలో కోడిపందేలు జోరుగా జరిగాయి. విజయవాడ శివారులోని రామవరప్పాడులో ఏర్పాటు చేసిన బరి వద్దకు ఇతర జిల్లాతో పాటు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వచ్చి జనం తరలివచ్చి కోడి పందేలు తిలకించారు. పందెం రాయుళ్లు లక్షల రూపాయల్లో పందేలు కాశారు.
కేసు నమోదు చేస్తామని హెచ్చరించినా: కోడి పందాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించినా నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో భారీస్థాయిలో పందేలు నిర్వహించారు. కొండి కందుకూరు నుంచి పలుకూరు వెళ్లే అడ్డ రోడ్డు పక్కన జోరుగా కోడి పందాలు సాగాయి.
16 మంది అరెస్టు : కర్నూలు జిల్లా ఆదోనిలో కోడి పందెం ఆడుతున్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 72 వేల నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు.