Next Two Months Complete Wedding Season :రానున్న 21 రోజులు తెలంగాణ వ్యాప్తంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. దీపావళి పండుగ తర్వాత మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించే సీజన్ మొదలు కానుంది. గత మూడు నెలలుగా మూఢా కారణంగా అన్నిచోట్ల శుభకార్యాలకు అడ్డుకట్టు పడింది. దీపావళి పండుగ తర్వాత నుంచి రెండు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. నవంబర్, డిసెంబర్ రెండు నెలల పాటు వాయిద్యాలు, మండపాలు, కేటరింగ్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు మిగతా వారికి చేతినిండా పనులు ఉండనున్నాయి. ఇప్పటికే పలువురు అడ్వాన్సులు ఇచ్చి, శుభకార్యాలకు అవసరమైన ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకుంటున్నారు.
పక్క జిల్లాల్లో షాపింగ్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఫంక్షన్ హాళ్లల్లో వసతులు బట్టి ఒక్క రోజు అద్దె రూ.40 వేల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుండటంతో వాటి ధరలు ఒక్కసారిగా పెంచేశారు. దీపావళి తోడవటంతో వస్త్ర, బంగారు దుకాణాలు కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. ఇదే ఒరవడి రెండు నెలల పాటు కొనసాగనుంది. ఉభయ జిల్లాల్లోని దుకాణాలతో పాటు కొంతమంది ప్రజలు వరంగల్, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి షాపింగ్ చేస్తున్నారు.
రాబోయే రెండు నెలల్లో 21 రోజులు మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఆయా రోజుల్లో ఉభయ జిల్లాల్లో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ వరకు అన్నిరకాల వేడుకలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని, ముఖ్యంగా వివాహాలు ఎక్కువగా జరగనున్నాయని మణుగూరుకు చెందిన పురోహితుడు విశ్వగిరి శర్వ ఈటీవీ భారత్కు తెలిపారు.
నెల
తేదీలు
నవంబర్
3, 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17,
డిసెంబర్
, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18, 26
ఉమ్మడి మెదక్ జిల్లాలో జోరు :ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో సుమారు వెయ్యికి పైగా ఫంక్షన్ హాళ్లు ఉండగా, వసతులను బట్టి ఒక్క రోజు అద్దె రూ.70 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో వాటి ధరలు ఒక్కసారిగా పెంచేశారు. దీపావళి కావడంతో వస్త్ర, బంగారు దుకాణాలు కొనుగోళ్లతో సందడిగా మారింది. ఇదే ఒరవడి రెండు నెలల పాటు ఉండనుంది. నాలుగు జిల్లాల్లోని సిద్దిపేట, గజ్వేల్, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, తాండూరుల్లోని దుకాణాల్లో రద్దీ పెరగనుంది. దీనికి తోడు ఇక్కడి నుంచి మరికొందరు హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయనున్నారు.