New Year Precautions :మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలకు యువత, తదితర వర్గాల వారు ఫుల్‌గా సిద్ధమయ్యారు. ఇందుకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకొని ఉన్నారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పార్టీలు చేసుకుంటూ 12 దాటిన తర్వాత మిత్రులు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతారు. మరికొందరు కుటుంబీకులు, బంధుమిత్రులతో కలిసి వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. అయితే న్యూ ఇయర్‌ను ఘనంగా జరుపుకునే క్రమంలో, వేడుకలు విషాదాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
వాహనాలను మితిమీరిన వేగంగా డ్రైవ్ చేయకూడదు :కొత్త ఏడాది వేడుకలంటేనే యువతకు బ్రేక్ లెస్ ఎంజాయ్ మెంట్. బైకులపై రోడ్డుల మీద షికార్లు చేస్తుంటారు. సరిగ్గా అర్ధరాత్రి 12 కాగానే రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తుంటారు. బైకులపై తిరుగుతూ హారన్లు మోగిస్తూ, అతి వేగంగా వెళతారు. ఇలా వెళ్లే క్రమంలో ఏ మాత్రం పట్టుతప్పిన న్యూ ఇయర్ విషాద ఇయర్‌గా మారే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా పోయే అవకాసం ఉంది. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం అనేది పూర్తిగా విరుద్ధం. సో ఎలాంటి ప్రమాదాలు లేని నూతన ఏడాదిని జరుపుకోవాలంటే జాగ్రత్తలే శ్రీరామ రక్ష.
మద్యం తాగరాదు మిత్రమా : న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అనేది విచ్చలవిడిగా చలామణి అవుతుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు చాలా మంది మద్యం తాగుతూ ఆ సమయం వరకు వేచి చూస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. మద్యం తాగడం, ఆ తర్వాత వాహనాన్ని డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ కావచ్చు. ఈ సందర్భంగా ఓ సలహా ఉంది. అదే మంగళవారం సాయంత్రం నుంచే వేడుకలు ఆరంభం కానున్న నేపథ్యంలో అందరూ ఓ చోట కలిసి మరుసటి రోజు ఉదయం స్వస్థలానికి వెళ్లిపోతే బాగుంటుంది. కొందరు మద్యం తాగితే నానా హంగామా సృష్టిస్తారు. ఇది ఇతరులకు ఇబ్బందికరం. అలాగే పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మాత్రం అసలు కనికరించరు. జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు.
నాణ్యమైన కేకులనే కొనండి : కొత్త ఏడాదికి స్వాగతం పలికికేందుకు అత్యధికులు కేక్‌లను కట్ చేస్తుంటారు. కానీ కేకులు కొనుగోలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మేలు. ఎందుకంటే తక్కువ రేటుకు కేకులు వస్తున్నాయని కొంటే మాత్రం మీ ఆరోగ్యానికి చిల్లే. ఆఫర్లను చూసి మోసపోకుండా, కేకుల తయారీకి వినియోగించే పదార్థాలు నాణ్యమైనవా లేక ఎన్ని రోజుల కిందట తయారు చేశారని తెలుసుకోవాలి. ఇక్కడ తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటే కాస్త అనుమానించాల్సిందే. ఎందుకంటే ఎవరూ అంతకంటే తక్కువ రేటుకు కేకులను ఇవ్వరు. సో అందుకే ఈ ఏడాది ప్రారంభంలో అనారోగ్య బారిన పడకుండా కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మేలు.