New Liquor Shops Open in AP :ఏపీలో నిర్వహించిన మద్యం లాటరీలో దుకాణాలను దక్కించుకున్న యజమానులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. లైసెన్స్ పొందిన వారంతా నేటి నుంచి షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీవ్యాప్తంగా చాలా చోట్ల లైసెన్స్‌దారులు ప్రాంగణాలను చూసుకునే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో అద్దెకు షాపుల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. విజయవాడ నగరంలో చాలా మందికి ఇప్పటికిప్పుడు అద్దెకు షాపులు దొరకలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది.
నిబంధనల మేరకు చాలాచోట్ల షాపులు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు. సిండికేట్‌తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు తమ లైసెన్సులను ఇతరులకు ఇచ్చేందుకు బేరసారాలు జరుపుతున్నారు. చాలా షాపులు చేతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త మద్యం విధానంలో భాగంగా ఇప్పటి వరకు నడుస్తున్న ప్రభుత్వ షాపులు మూతపడ్డాయి. వీటిలోని సరకును వ్యాపార సమయం ముగిసిన తర్వాత మద్యం డిపోల అధికారులు, సిబ్బంది లెక్కించారు. సరకును బుధవారం ఉదయం నుంచి సాయంత్రంలోగా సంబంధిత డిపోలకు చేరుస్తారు.