Bharata Natyam Artists Got Place in Guinness Record:భరతనాట్యం అంటే నృత్యకళ మాత్రమే కాదని ఆలోచనలను భావరూపంలో వ్యక్తపరిచే కళాత్మక సాధనం అంటున్నారు ఈ యువతులు. వేదికలపై ఔరా అనిపించేలా నాట్యంతో గిన్నిస్ రికార్డునూ ఖాతాలో వేసుకున్నారు. చదువుకుంటూనే దేశంలో వివిధ చోట్ల ప్రదర్శనలిస్తూ కళాసేవ చేస్తున్నారు. ఉత్తమ నృత్యకారిణులుగా పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
లయబద్ధంగా నృత్యాన్ని అభినయిస్తున్న ఈ నలుగురు యువతులు చిన్నవయసులోనే భరతనాట్యంలో అద్భుత ప్రావీణ్యం కనబరుస్తున్నారు. నెల్లూరుకు చెందిన వీరంతా నగరంలోని గురుకృపా కళాక్షేత్రంలో సురభి గాయత్రి వద్ద నృత్యాన్ని అభ్యసిస్తున్నారు. భరతనాట్యంలో పలు నృత్యరీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
వారిలో బీటెక్ చదువుతున్న పూజ 14 ఏళ్లుగా భరతనాట్యంలో శిక్షణ పొందుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 300లకు పైగా ప్రదర్శనలు ఇచ్చి నృత్యఝరి సహా ఎన్నో అవార్డులు అందుకుంది. తోటి స్నేహితులతో కలసి గిన్నిస్ రికార్డునూ సొంతం చేసుకుంది. విదేశాల్లోనూ శాస్త్రీయ నృత్యం గొప్పదనం చాటడమే ఆశయమని చెబుతోంది.
కళ్లు చెదిరిపోయే రేంజ్లో శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ - మీరు చూశారా?
భారతీయ సంస్కృతికి ప్రతిరూపమైన భరతనాట్యంలో 14 ఏళ్ల నుంచి శిక్షణ పొందుతోంది మోక్షిత రాజేశ్వరి. ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టంగా అనిపించదని, అందుకే చదువుకుంటూనే 400 పైగా ప్రదర్శనలు ఇవ్వగలిగానని చెబుతోంది. శ్రీశైలంలో నాదనీరాజనం, తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తానని అంటోంది.