TIRUMALA RATHA SAPTAMI 2025: తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో ఘనంగా జరగనున్న రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 4వ తేదీన శ్రీవారి ఆలయంలో జరిగే రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. రథ సప్తమి వేడుకలను పురస్కరించుకుని భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా యంత్రాంగంతో ఆలయవీధుల్లో ఈవో శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఉత్సవాలలో రథసప్తమి అత్యంత ముఖ్యమైందని, ఆ రోజున స్వామివారు ఏడు ప్రధాన వాహన సేవలపై దర్శనం ఇస్తారన్నారు. ఏటా శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహిస్తారని అన్నారు.
ఒకేరోజు సప్త వాహనాలపై శ్రీవారు: ఫిబ్రవరి 4 తేదీన ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో మొదలయ్యి, రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వాహన సేవలు ముగిస్తాయన్నారు. రథసప్తమి వేడుకలకు దాదాపు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. మాడవీధుల్లో వాహన సేవలు తిలకించేందుకు వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, నీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తామన్నారు. గ్యాలరీల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
టీటీడీ సూచనలు:
- రథసప్తమి సందర్భంగా తిరుమలలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు.
- అష్టాదళ పాదపద్మారాధన, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, కల్యాణోత్సవం సేవలను రద్దు చేశారు.
- చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, ఎన్‌ఆర్‌ఐలు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను సైతం రద్దు చేశారు.
- తిరుపతిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు జారీ చేయడం లేదని తెలిపారు.
- ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుని చేస్తున్నట్లు ప్రకటించారు.
- బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని పేర్కొన్నారు.
- 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని సూచించారు.
రథసప్తమి రోజు శ్రీవారి వాహనసేవల షెడ్యూల్:
- ఫిబ్రవరి 4 తేదీన ఉదయం 5:30 నుంచి 8:00 వరకు సూర్యప్రభ వాహన సేవ
- ఉదయం 9:00 నుంచి 10:00 వరకు చిన్నశేష వాహన సేవ
- ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు గరుడ వాహన సేవ
- మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 వరకు హనుమంత వాహన సేవ
- మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 వరకు చక్రస్నానం
- సాయంత్రం 4:00 నుంచి 5:00 వరకు కల్పవృక్ష వాహన సేవ
- సాయంత్రం 6:00 నుంచి 7:00 వరకు సర్వభూపాల వాహన సేవ
- రాత్రి 8:00 నుంచి 9:00 వరకు చంద్రప్రభ వాహనం సేవ
తిరుమలలోని ఈ పెయింటింగ్ ఏమిటో తెలుసా? - 90శాతం మంది భక్తులు ఫెయిల్!