Alliance Ministers Comments on Jagan Protest: జగన్‌కి కావాల్సింది ప్రతిపక్ష హోదానే తప్ప ప్రజా సమస్యలు కాదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శాసనసభ సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే ఈ రోజు జగన్ సభకు వచ్చారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా అసెంబ్లీలో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ప్రజా సమస్యల్ని సమర్ధవంతంగా లేవనెత్తారని మంత్రి గుర్తుచేశారు. లోక్ సభలో వాజ్ పేయికి ప్రతిపక్ష నేత హోదా లేకున్నా దేశ సమస్యలను అర్ధవంతంగా సభ దృష్టికి తీసుకువచ్చారని అనగాని తెలిపారు.
2004లో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ రాహుల్ గాంధీ సభకు హాజరై ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటారని మంత్రి అన్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యలను ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటూ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలివ్వని హోదాను జగన్ కోరుకోవడం ఆయన నియంత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. జగన్ రెడ్డికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉన్నా, చట్ట నిబంధనలపై గౌరవం ఉన్నా శాసనసభా సమావేశాలకు హాజరయ్యేవారని మంత్రి అనగాని హితవుపలికారు.
ప్రజల తీర్పును అవమానించడమే: ప్రతిపక్షాన్ని గుర్తించండి అంటూ అసెంబ్లీలో నినాదాలు చేయడం జగన్ దివాళాకోరు తనానికి నిదర్శనమని ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ సభాసంప్రదాయాల్ని మంటగలిపారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా ప్రజలు గుర్తించలేదని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకత్వాన్నీ ప్రజలు తిరస్కరించారని స్పష్టం చేశారు. ప్రజలివ్వని హోదాను బలవంతంగా పొందాలనుకోవడం అవివేకం, మూర్ఖత్వమని దుయ్యబట్టారు. ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పును అవమానించడమేనని మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్ట సభల్ని కించపరచడమే: అసెంబ్లీలో జగన్ అండ్ కో వ్యవహరించిన తీరుపై మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడగడానికి మాత్రమే అసెంబ్లీకి రావడం చట్ట సభల్ని కించపరచడమే అని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ పాలన మొత్తాన్ని అవహేళన చేశారని దుయ్యబట్టారు. జగన్ అవినీతి, అరాచక పాలనపై విసిగిపోయి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల పక్షాన నిలబడతామని చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు.
సభ్యత్వాలు పోతాయనే భయం - అందుకే అలా వచ్చి వెళ్లారు: అచ్చెన్నాయుడు
ఈ ఆప్షన్ గురించి తెలుసా! - ఇలా చేస్తే రాష్ట్రంలో ఎక్కడున్నా పింఛను పొందొచ్చు