NDSA Committee Second Visit : ఆనకట్టల అధ్యయనంపై నియమించిన ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఇవాళ రాష్ట్రానికి చేరుకుంది. జలసౌధలో ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సీడీఓ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. ఈభేటీలో విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. గతంలో మురళీధర్ ఈఎన్సీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో నిర్మాణం జరిగింది. వీరి నుంచి కమిటీ అన్ని రకాల వివరాలు తీసుకుంది. మూడు విభాగాల ఇంజినీర్లతో విడివిడిగా సమావేశమై వివరాలు తీసుకున్నారు. రేపు మిగిలిన విభాగాల ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులతో కమిటీ(NDSA Committee) భేటీ కానుంది.
NDSA committee meet at Jalasoudha :గత పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆనకట్టలను పరిశీలించిన కమిటీ, కొంత మంది ఇంజనీర్లతోనూ సమావేశమైంది. మేడిగడ్డ(Medigadda), అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్, ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ, తదితర వివరాలు తీసుకొంది. గత పర్యటనకు కొనసాగింపుగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కమిటీ హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్స్ విభాగాలతో ఇవాళ కమిటీ సమావేశం అయ్యింది. ఇంజినీర్లతో విడివిడిగా భేటీ కానున్న కమిటీ, పదవీ విరమణ చేసిన, బదిలీ అయిన ఇంజినీర్లు కూడా హాజరు కావాలని పేర్కొంది.
ఈ నిపుణుల కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటిలో మరో ఐదుగురు సభ్యులుగా ఉన్నారు. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, ఎన్డీఎస్ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.