Arrest warrant to SIB Ex Chief in Phone Tapping Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, తాజాగా మరో అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఆయనతో పాటు మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావుపైనా నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం వారు దేశం బయట ఉన్నారని, వారిపై రెడ్ కార్నర్ నోటీసులు ప్రాసెస్ చేసేందుకు 73 సీఆర్‌పీసీ కింద వారెంట్ జారీ చేయాల్సిందిగా ఇటీవల పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Phone Tapping Case Update :ఈ అంశంపై ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు తరఫు న్యాయవాది సురేందర్ రావు వారి తరఫున కోర్టులో మెమో దాఖలు చేశారు. 30 ఏళ్ల సర్వీసులో పోలీసు శాఖలో జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశానని, కేసుకు పూర్తిగా సహకరిస్తున్నాని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కేసు నమోదు కాక ముందే తాను చికిత్స కోసం అమెరికా వచ్చానని, జూన్ 16న చికిత్స పూర్తయిన తర్వాత వస్తానని తెలిపారు.