తెలంగాణ

telangana

ETV Bharat / state

పైసా ఖర్చు లేకుండా పల్సర్​ బైక్​పై రయ్​ రయ్​ - నీ 'సోలార్'​ ఐడియా అదిరింది బాసూ - Solar Powered Bike In Nalgonda - SOLAR POWERED BIKE IN NALGONDA

Solar Powered Bike In Nalgonda : కాస్త మనసు పెడితే ప్రతి సమస్యకూ పరిష్కారం దొరకుతుందని, అందుకు పీజీలు, పీహెచ్​డీలు ఉండాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాడు ఓ నల్గొండ వాసి. సృజనాత్మకత ఉంటే చాలని, విభిన్నమైన ఆలోచనలే అద్భుతమైన ఆవిష్కరణలకు దారి తీస్తాయని చాటి చెప్పాడు. చమురు ధరలు మండిపోతున్న వేళ సౌరశక్తితో నడిచే బైక్‌ను తయారు చేసి ఔరా అనిపించాడు. రాత్రి, పగలు తేడా లేకుండా నడిచేలా తీర్చిదిద్దారు. పైసా ఖర్చు లేకుండా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా సాగిస్తున్నాడు. ఇంతకీ ఆ బైక్‌ ఎలా తయారు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Solar Powered Bike In Nalgonda
Solar Powered Bike In Nalgonda (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 4:26 PM IST

Updated : May 31, 2024, 8:59 PM IST

పైసా ఖర్చు లేకుండా పల్సర్​ బైక్​పై రయ్​ రయ్​ - నీ 'సోలార్'​ ఐడియా అదిరింది బాసూ (ETV Bharat)

Solar Powered Bike In Nalgonda :పల్సర్‌ బైకు పైన రయ్ రయ్ అంటూ తిరుగుతున్న ఇతని పేరు మహమ్మద్‌ షరీఫ్‌. నల్గొండకు చెందిన ఇతను, గత కొన్నేళ్లుగా వెల్డింగ్‌ షాపులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. తాను 20 ఏళ్లుగా వాడుతున్న పల్సర్‌ బైక్‌ ఇంజిన్‌ పూర్తిగా పాడైపోయింది. మరమ్మతులు చేయించాలంటే రూ.15 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు.

దీంతో ఓ కొత్త ఆలోచనతో సౌరశక్తితో నడిచే బైక్‌ను తయారు చేయాలనుకున్నాడు. అందుకోసం నెల రోజుల పాటు శ్రమించాడు. తన బైక్​పైనే ప్రయోగాలు చేశాడు. ఫలితంగా అతి తక్కువ ఖర్చుతో నడిచే సోలార్‌ బైకును తయారు చేశాడు. దీనిని చూసిన వారంతా పల్సర్‌ బైక్ ఏంటీ? సోలార్‌తో నడవటం ఏంటి? అని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

Pulsar Bike Into A Solar Bike :షరీఫ్‌ తనకు ఇష్టమైన తన పల్సర్‌ బైకును సోలార్‌ బైక్‌గా మార్చాలనుకున్నాడు. పాడైపోయిన బైక్‌ ఇంజిన్‌ తీసివేసి, దాని స్థానంలో 12 వోల్టుల సామర్థ్యం కలిగిన 4 బ్యాటరీలను అమర్చాడు. ఇందుకు రూ.30 వేల వరకు ఖర్చు చేశాడు. 5 నెలలు బ్యాటరీతో బైకు నడిపాడు. 4 గంటల ఛార్జ్‌ చేస్తే దాదాపు 40 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

అంతా బాగానే ఉన్నా ఎక్కువ దూరం వెళ్లాలంటే బ్యాటరీ సరిపోవడం లేదని షరీఫ్ గ్రహించాడు. ఈ సమస్యకు పరిష్కారంగా ఒక సోలార్‌ ప్యానెల్‌ను బైకుపైన ఏర్పాటు చేశాడు. అందుకోసం మరో రూ.10 వేలు వెచ్చించాడు. మరో బ్యాటరీని బ్యాకప్‌ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.40 వేల ఖర్చుతో సౌర శక్తితో నడిచే బైక్‌ను ఆవిష్కరించాడు.

Mohammad Sharif Made Solar Bike : 'ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలంటే మార్కెట్​లో అధిక ధరలున్నాయి. లక్షలు ఖర్చుపెడితే గానీ వాటిని కొనలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సోలార్ బైక్ రూపొందించా'నని చెబుతున్నాడు షరీఫ్‌. 'ఎలక్ట్రిక్ బైక్‌లాగే ఇది కూడా బ్యాటరీతో నడుస్తుంది. ఛార్జింగ్ స్టేషన్ గానీ, ఇంట్లో గానీ కరెంట్ సప్లై ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అవి అందుబాటులో లేని సమయంలో సూర్యకాంతితోనే దీని బ్యాటరీ ఛార్జ్ అవుతుంద'ని చెబుతున్నాడు.

"నా వద్ద గత 20 ఏళ్లుగా పల్సర్ బైక్ ఒకటి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దీనిని సోలార్ బండిగా మార్చాను. ఈ వాహనంతో 40-50 కి.మీ ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ సోలార్ మిషన్​ను స్కూటీలకు కూడా అమర్చవచ్చు. బైక్​లలో హైబ్రిడ్ సిస్టమ్​లా ఏర్పాటు చేసుకోనేందుకు అవకాశం ఉంటుంది. ఈ వాహనాన్ని ఉపయోగించడం వల్ల పర్యావరణ హితంగా కూడా ఉంటుంది."- మహమ్మద్‌ షరీఫ్‌, సోలార్‌ బైక్‌ తయారీదారుడు

ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో :ప్రస్తుతం ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల మోతను చూసి సామాన్య ప్రజలు బైక్‌లు, కార్లు నడపాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో సౌర శక్తితో నడిచే వాహనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని షరీఫ్ చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ సౌర శక్తితో నడిచే వాహనాలను వాడాలని షరీఫ్‌ కోరుతున్నాడు.

డిగ్రీలు పూర్తి చేసి - సహజ సిద్దమైన వంట నూనె తయారీ వ్యాపారంలో రాణిస్తున్న ముగ్గురు మిత్రులు

Masti Goli Soda in Karimnagar : సాఫ్ట్‌వేర్​ జాబ్​ విడిచి.. గోలీ సోడాతో హిట్​ కొట్టాడు

Last Updated : May 31, 2024, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details