Nagarkurnool Student Made Three In One Bicycle :చిన్నతనంలో వెంటాడిన అనారోగ్య సమస్యలను అధికమించి విజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో ప్రతిభ చాటాడు నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన విద్యార్థి గగన్‌చంద్ర. ఈ బాలుడు మూడు రకాలుగా ఉపయోగించే (త్రీ ఇన్ వన్) హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించాడు. జనవరి 20 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయిలో బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఇతడి ఆవిష్కరణ మూడో స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది.
చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నా :ప్రాజెక్టు గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గగన్‌చంద్రను ఎక్స్ వేదికగా అభినందించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలుకు చెందిన మాచినెపల్లి సువర్ణ (నాగరాణి), భాస్కర్ దంపతులకు కుమారుడు గగన్‌చంద్ర. పుట్టిన 25 రోజులకే అతడికి న్యూమోనియా సోకింది. ఏడేళ్ల వరకు అనారోగ్యం వెంటాడింది.
3 విధాలా ఉపయోగించవచ్చు :ప్రస్తుతం బల్మూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయుల సహకారంతో హైబ్రిడ్ సైకిల్‌ను తయారు చేశాడు. సాధారణ సైకిల్‌కు సౌర విద్యుత్ పలకలు, బ్యాటరీ, విద్యుత్తు సర్దుబాటుకు వైపర్ మోటార్ (బూస్టర్), సెల్‌ఫోన్‌తో డిస్‌ప్లే, జీపీఎస్ అమర్చాడు. ఇది సౌర విద్యుత్తులో ఒక్కసారిగా 30 కి.మీ ప్రయాణిస్తుంది. సౌరశక్తి అందుబాటులో లేనప్పుడు విద్యుత్ బైక్‌లా ఛార్జింగ్ పెట్టి ద్విచక్రవాహనంలా నడపవచ్చు. సాధారణ సైకిల్‌లాగా కూడా తొక్కొచ్చు.