A Woman Fell into a Canal while Taking Selfie : సెల్ఫీ సరదా మహిళ ప్రాణం మీదకు తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారానికి వెళ్లింది. ఈ క్రమంలో ఒక ప్రాంతంలో సెల్ఫీ వీడియో తీసుకోవాలని అంతా కారు నుంచి కిందకు దిగారు. మహిళ సెల్ఫీ వీడియో తీస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి కాల్వలో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను రక్షించారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ వద్ద జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నుంచి కారులో మిర్యాలగూడ వైపు ఓ కుటుంబం కారులో వెళుతుంది. వారు ఉన్నట్టుండి వేములపల్లి సాగర్ ఎడమ కాల్వ వద్ద వాహనాన్ని ఆపారు. అప్పుడు ఆ ప్రకృతి అందాలను చూసి ముచ్చటపడి ఒక సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. దీంతో భర్త, ఆమె, తమ్ముడు, కుమార్తెలతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అనుకొని సంఘటన ఎదురైంది. సెల్ఫీ దిగుతుండగా ఆ మహిళ ప్రమాదవశాత్తు జారిపడి సాగర్ కాల్వలో పడిపోయింది.
ఆమెకు కొద్దిగా ఈత రావడంతో అలా కొంత దూరం వరకు కెనాల్లో ఈదుకుంటూ నీటిపై తేలియాడుతూ వెళ్లింది. ఈ క్రమంలో మహిళను గమనించిన స్థానికులు సాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జిపై నుంచి తాళ్ల సహాయంతో రక్షించాలని అనుకున్నారు. తాళ్లను కాల్వలో వేసి ఆమెను పైకి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తిరిగి కాల్వలో పడిపోయింది. దీంతో కొంతమంది యువకులు అందులోకి దూకి మహిళను కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు.