Beware Of Thieves At Banks : డబ్బు విత్ డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!! మిమ్మల్నే ఓ కంట కనిపెడుతూ ఓ ముఠా తిరుగుతోంది. డబ్బు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే సర్వం కోల్పోవడం ఖాయం. నగదు విత్ డ్రా చేసేటప్పుడు ఆదమరిచారో అంతే సంగతులు. ఉన్నదంతా దోచేస్తారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బ్యాంకుల వద్ద ఇలా చోరీలు చేసే ముఠాలు పెరిగిపోతున్నాయి. దీంతో బ్యాంకుకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై బ్యాంకుల వద్ద భద్రతా చర్యలతో పాటు ముఠాను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. మీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నట్లుగా కనిపించినా నగదు తస్కరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త.
కర్ణాటక దొంగల ముఠాగా అనుమానం :జనగామలో మూడు నెలల క్రితం జరిగిన ఓ చోరీ ఘటనలో జనగామ క్రైమ్ ఎస్సై మోదుగుల భరత్ నేతృత్వంలో క్రైమ్ విభాగం పోలీసులు చోరీ దర్యాప్తులో భాగంగా నిందితుల్లో కర్ణాటకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద చోరీ ఘటనలు వెలుగు చూస్తుండటంతో కర్ణాటకు చెందిన ముఠా సభ్యులుగానే పోలీసులు అనుమానిస్తూ దర్యాప్తు చేపట్టారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు :
- చాకచక్యంగా మాటలు కలిపి, నగదును కాజేస్తున్న అగంతకుల పట్ల ప్రజలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి.
- దొంగలు వృద్ధులు, నడి వయస్సులు, అంతగా చదువు రాని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా పోలీసుల విచారణలో తేలడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- వృద్ధులు, నడి వయస్సుల వారు బ్యాంకులకు వెళ్తున్న తరుణంలో వెంట ఒకరిని తీసుకువెళ్తే క్షేమం.
- అలాగే నిరక్షరాస్యులు డ్రా చేసిన తరువాత ఏమరుపాటుగా ఉండొద్దు.
- కార్లు, ద్విచక్రవాహనాల్లో డబ్బులను పెట్టుకున్నప్పుడు నిర్లక్ష్యం వహించరాదు.
- బ్యాంకు లోపల, బయట పూర్తిగా సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలి
- పార్కింగ్ వద్ద కూడా పలు జాగ్రత్త చర్యలు, సెక్యూరిటీ గార్డుల సాయం తీసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
- బ్యాంకులతో పాటు మార్గ మధ్యలో ఖాతాదారులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెబుతున్నారు.