Munneru Flood Victims Story : చరిత్రలో మొదటిసారి అత్యంత గరిష్ట నీటిమట్టం 36 అడుగులు దాటి మహోగ్రంగా ప్రవహించిన మున్నేరు ముంపు ప్రాంతాల వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. గంటల్లోనే ఊహించని ఉత్పాతంలా ముంచెత్తిన మున్నేరు తమను కోలుకోలేని దెబ్బతీసిందని ఆవేదన చెందుతున్నారు. ఆదివారం (సెప్టెంబరు 1వతేదీ) మేల్కొనక ముందే ముంపు ప్రాంతాలను కకావికలం చేసింది.
ఎక్కడ చూసినా దయనీయ దృశ్యాలే : దానవాయిగూడెం కాలనీ, గణేశ్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం, సారథినగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వరనగర్, బొక్కల గడ్డ, మోతీనగర్, పంపింగ్ వెల్ రోడ్, ధంసలాపురం కాలనీల్లో ఎటుచూసినా దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. మున్నేరు తరమడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఇళ్లను వదిలి కట్టుబట్టలతో వెళ్లిన బాధితులు తిరిగి వచ్చేసరికి సర్వం కోల్పొయిన దీనావస్థలు ఉన్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్లకు చేరుకున్న బాధితులు ఇళ్లను, ఇంటి పరిసరాలను చూసి గుండెలవిసేలా విలపిస్తున్నారు.
కాలనీకో కథ కుటుంబానిదో వ్యథ :దాదాపు 15 కాలనీల్లో ఎటుచూసినా వరద మిగిల్చిన విషాదాలే కనిపిస్తున్నాయి. ఉప్పెనలా ఊరి మీద పడ్డ మున్నేరు తాకిడికి ఇళ్లలోని నిత్యావసరాలు సహా దుస్తులు, వంటసామగ్రి, ఫర్నీచరు, బీరువాలు,టీవీలు,ఫ్రిజ్‌లు కూలర్లు, వాషింగ్ మిషన్లు వరదలో కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. కిరాణా దుకాణాల్లో సామగ్రి పాడైంది. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆధార్ , రేషన్ , డ్రైవింగ్ లైసెన్స్‌లు తడిసి ముద్దయ్యాయి. కట్టుబట్టలు తప్ప తమకేమీ మిగల్లేదని, గంగమ్మ సర్వం తుడిచిపెట్టుకుపోయిందని విలపిస్తున్నారు.