Medicine for Baldness: జుట్టు రాలుతోందంటే చాలు ఎంతో మంది బట్ట తల వస్తుందేమో అని భయపడుతుంటారు. సబ్బులు, షాంపూలు మార్చడంతో పాటు మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ అన్నింటినీ వాడుతారు. ఇప్పటికే బట్ట తల వచ్చిన వాళ్లు హెయిర్ ప్లాంటేషన్‌తో పాటు కొన్ని రకాల చికిత్సలు చేసుకుంటున్నారు. ఇంకొందరు విగ్ పెట్టుకుని కవర్ చేస్తుంటారు. అయితే బట్ట తల వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మాత్రలతో బట్ట తల సమస్యకు మంచి ఫలితం ఉంటుందని ముంబయికి చెందిన ప్రొఫెసర్ రచిత తెలుపుతున్నారు.
ఏపీ గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన భారత చర్మ, సుఖ, కుష్ఠు నిపుణుల సంఘం (ఐఏడీవీఎల్) కుటికాన్-2024 రెండు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. ఈ వేదికపై ప్రొఫెసర్ రచిత పలు విషయాలు తెలిపారు. బట్ట తల సమస్యకు పూతమందు లేదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్య రంగంలో జరిగిన పరిశోధనలలో మాత్రలు కూడా చక్కని ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.
ఈ చికిత్సతో జుట్టు వృద్ధి చెందడం గుర్తించామని, వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాల్సి ఉంటుందని వివరించారు. జుట్టు రకం, తీరుతెన్నులు, వంశపారంపర్య సమస్యలు విశ్లేషించి మాత్రలు ఎంత మోతాదులో వాడాలో నిర్ణయించాల్సి ఉందన్నారు. చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుందని చెప్పారు. చర్మ చికిత్సలో లేజర్ చికిత్స ఓ భాగమైపోయిందని బెంగళూరుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగా వచ్చిన నానో ఫికో లేజర్స్ మచ్చలు, గుంతలు, గీతలు, ముడతలు వంటి ఎన్నో సమస్యలను నయం చేస్తున్నాయన్నారు. ఈ నూతన చికిత్సతో దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని తెలిపారు.