Tiger in Nirmal District : ఇటీవల వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో ఆవాసాలు లేక వన్యప్రాణాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల ప్రజలు, పశువులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చిరుత, పెద్దపులి, ఎలుగుబంటి సంచారం, దాడులు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలే నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా (పలిమెల అటవీ ప్రాంతం)లో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
నిర్మల్ జిల్లా కేంద్రంలో చిరుత పులుల సంచారం కలకలం రేపింది. పట్టణంలోని విశ్వనాత్ పేట్ శివారులో ఉన్న కొండపై గత మూడు రోజులుగా చిరుత పులి తిరుతున్నట్టు స్థానికులు పేర్కొన్నారు. ఉదయం గుట్టపై కూర్చొని చిరతపులి, చిరుత పిల్ల కనిపించినట్లు అక్కడున్న ఓ పశువుల కాపరి తెలిపారు. గతంలోను చిరుత సంచరించిందని ఇది రెండవ సారి చూసినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. అటువైపు ఒంటరిగా వెళ్లొద్దని, రాత్రొ వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు స్థానికులకు సూచించారు.