Motla Thanda Grama Panchayath : మీరు దీనిని చూసి కిరాణా షాపో, పాన్ డబ్బానో అనుకునేరు. ఇక్కడ కనిపిస్తున్న రేకుల డబ్బాలో ఉన్నది ఓ గ్రామ పంచాయతీ కార్యాలయం. ఈ విషయం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కానీ ఇదే వాస్తవం. ఇది మహబూబాబాద్ జిల్లాకు చెందిన మొట్ల తండాలో ఉంది. 2018లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఈ మొట్ల తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది.
అద్దె చెల్లించకపోవడంతో వచ్చిన తిప్పలు : 2018 నుంచి మొట్ల తండాకు సొంత భవనం లేకపోవడంతో పంచాయతీ కార్యాలయం అక్కడి స్థానికుల ఇళ్లలో అద్దె ప్రాతిపదికన కొనసాగింది. ఇంతకుముందు ఆఫీసు ఉన్న కిరాయి ఇంట్లో శుభకార్యం ఉండడంతో ఆ ఇంటి యజమాని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. సమయానికి అద్దె డబ్బులు ఇవ్వకపోవడంతో తండాలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి అవసరమైన గదిని, ఇంటిని ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడా భవనం లభించక ఈ రేకుల డబ్బాకు మార్చారు.
ముందుకు రాని కాంట్రాక్టర్లు :ఇటీవల గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరైనట్లు మండల పంచాయతీ అధికారి పార్థ సారధి తెలిపారు. తండాలో ప్రభుత్వం స్థలం కేటాయించినా నిర్మాణం చేసేందుకు గుత్తే దారులు ఎవరూ ముందుకు రాలేదు. అలాగే ఆ స్థలం కొంత వివాదాల్లో కూడా ఉండటం కూడా మరో కారణం.